Telugu Global
Telangana

తెలంగాణలో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ వ్యూహం.. సీడబ్ల్యూసీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు

మరి కొన్ని వారాల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణలో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ వ్యూహం.. సీడబ్ల్యూసీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలని అధిష్టానం భావిస్తోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించినా.. తెలంగాణలో పార్టీ పతనం కావడాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతోంది. గత తొమ్మిదేళ్లలో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. పైగా కీలకమైన నాయకులు కూడా అధికార బీఆర్ఎస్, బీజేపీల్లోకి వలస వెళ్లారు. మరి కొన్ని వారాల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఇక మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినా.. కేంద్రంలోని బీజేపీ ఎత్తుగడతో అక్కడ అధికారాన్ని కోల్పోయింది. ఈశాన్య రాష్ట్రమైన మీజోరాంలో కూడా బలం పెంచుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో కెల్లా తెలంగాణ మీదే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఫోకస్ చేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని తొలుత భావించినా.. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఫుల్ జోష్ అందిపుచ్చుకున్నది. ఇతర పార్టీల్లోని కీలక నాయకులను కాంగ్రెస్‌లోకి రప్పించడంతో దాదాపు సక్సెస్ అవుతోంది. ఒకవైపు నాయకుల చేరికలపై దృష్టి పెట్టడంతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే.. కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు మాత్రమే ఉంటే సరిపోదని.. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను మించి చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇప్పటికే రైతు, యువ, ఎస్సీ, ఎస్టీ, మహిళా డిక్లరేషన్లు చేసింది. త్వరలోనే మైనార్టీ, ఇతర డిక్లరేషన్లను చేసే అవకాశం ఉన్నది. దీంతో పాటు మేనిఫెస్టోను కూడా జనరంజకంగా తయారు చేయాలని చూస్తోంది. హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలతో పాటు.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడం పైనే దృష్టి పెట్టింది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపేలా ప్రచారాన్ని నిర్వహించాలని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్లలోని ముఖ్యాంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లడమే కాకుండా.. స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా వ్యూహం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సమయంలో సీనియర్ల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టేలా వారితో చర్చించనున్నది. ఇటీవల రేవంత్ రెడ్డిని పూర్తిగా సైడ్ చేశారనే వార్తలతో ఆ వర్గం నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఈసీలో స్థానం కల్పించడంతో ఇతర సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. ముందుగా వీరిందరితో అధిష్టానం మాట్లాడుతుందని సమాచారం.

రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి నాయకుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించడం, కాంగ్రెస్ చేయబోయే సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృతంగా ఎలా తీసుకెళ్లాలనే విషయాలపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు. ఈ నెల 16న జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఈ అంశాలపై కీలకంగా చర్చించి.. ఆ మరుసటి రోజు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో ఈ అంశాలను వెల్లడించనున్నారు. కేవలం తెలంగాణకు సంబంధించిన విషయాలే కాకుండా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న విభేదాలపై కూడా దృష్టి పెట్టింది. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవకపోతే పార్టీ మరింతగా పతనం అవుతుందని.. కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో గెలుపు తప్పని సరని అధిష్టానం అంచనా వేస్తోంది. ఇందుకు అవసరమైన కీలక నిర్ణయాలు సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకోనున్నారు.

First Published:  6 Sept 2023 8:41 AM IST
Next Story