తెలంగాణ కోసం కేసీఆర్ త్యాగం చేశారు.. మోదీ ఏం చేసిండు..?
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం దారుణం అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ కోసం కేసీఆర్ త్యాగం చేశారని, ప్రాణం పోతుందని తెలిసినా ఆయన ఉద్యమం చేశారని గుర్తు చేశారు దయాకర్.
టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ గొప్పదనం గురించి చెప్పడం వింతేమీ కాదు, కానీ ఓ టీవీ డిబేట్ లో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, కేసీఆర్ త్యాగాన్ని కొనియాడారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారని అన్నారు. వాస్తవానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కానీ ఇప్పుడు మధ్యలో బీజేపీ కూడా చేరింది. దీంతో.. బీజేపీని విమర్శించే క్రమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.
వారసత్వం, కుటుంబ రాజకీయాలు..
వారసత్వం, కుటుంబ రాజకీయాలపై ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీవీ చర్చ మొదలైంది. కాంగ్రెస్ తరఫున చర్చలో పాల్గొన్న దయాకర్.. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని చెప్పారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ.. దేశం కోసమే ప్రాణాలు అర్పించారని అన్నారు. ఈ క్రమంలో సోనియా గాంధీ ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిందని, ఆమె త్యాగనిరతిని కొనియాడారు. ఆ మాటకొస్తే అసలు దేశం కోసం బీజేపీ నాయకులు ఏం చేశారని నిలదీశారు దయాకర్. మోదీ ఏం చేశారు, అమిత్ షా ఏం చేశారని అన్నారు. కుటుంబ రాజకీయాలే ముఖ్యం అనుకుంటే.. అప్పట్లో పీవీ, ఆ తర్వాత మన్మోహన్ ప్రధాన మంత్రులు అయ్యేవారా అని నిలదీశారు. ఇంత చేసినా కుటుంబ రాజకీయాలంటూ కాంగ్రెస్ ని టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తోందని మండిపడ్డారు. ఆమాటకొస్తే కుటుంబ రాజకీయాల లెక్క తీస్తే, బీజేపీ నేతల వారసులు ఎంతమంది, ఏఏ పదవుల్లో ఉన్నారో చెప్పాలా అని ప్రశ్నించారు.
కేసీఆర్ త్యాగం..
కాసేపు చర్చ తెలంగాణవైపు మళ్లింది. చీకట్లో తెలంగాణ విభజన జరిగిందని, పార్లమెంట్ తలుపులు మూసేసి తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ బీజేపీ నేతలు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు దయాకర్. అలాంటి బీజేపీ నేతలు, ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం పాకులాడటం సిగ్గుచేటని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం దారుణం అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ కోసం కేసీఆర్ త్యాగం చేశారని, ప్రాణం పోతుందని తెలిసినా ఆయన ఉద్యమం చేశారని గుర్తు చేశారు దయాకర్. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగంలో ఒక శాతం అయినా బీజేపీ నేతలు చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం మోదీ ఏం చేశారు, అమిత్ షా ఏం చేశారని నిలదీశారు దయాకర్. ఈ చర్చలో కేసీఆర్ గురించి దయాకర్ చేసిన వ్యాఖ్యలు హైలెట్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి. తెలంగాణ కోసం త్యాగం చేసింది.. మోదీయా, కేసీఆరా.. అనే చర్చ నడుస్తోంది.