టీ.కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. ప్రత్యేక హామీలివే
తెలంగాణలోని మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలవాలని పట్టుదలతో ఉన్న హస్తం పార్టీ స్పెషల్ మేనిఫెస్టోలో కీలక హామీలిచ్చింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షితో కలిసి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయనుందో ఈ మేనిఫెస్టోలో వివరించారు.
తెలంగాణలోని మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలవాలని పట్టుదలతో ఉన్న హస్తం పార్టీ స్పెషల్ మేనిఫెస్టోలో కీలక హామీలిచ్చింది. మోడీ సర్కార్ రద్దు చేసిన ITIRను తిరిగి ప్రారంభించడంతో పాటు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - IIM, మైనింగ్ యూనివర్సిటీ లాంటివి మంజూరు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపింది.
వీటితో పాటు భద్రాచలం ఆలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న 5 గ్రామాలు తిరిగి తెలంగాణలో కలపడం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, నూతన ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపింది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపు, హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. వీటితో పాటు ఇండస్ట్రీయల్ కారిడార్ల ఏర్పాటు, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించడంతో పాటు తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.