Telugu Global
Telangana

300 మందిని వడపోస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. ఢిల్లీలో ఆశావహుల హడావిడి

స్క్రీనింగ్ కమిటీ ఇప్పుడు ఢిల్లీలో సమావేశమై వడపోత కార్యక్రమం మొదలు పెట్టింది. తొలి విడతలో 40 సీట్లకు టికెట్లు ప్రకటించాలని భావిస్తోంది.

300 మందిని వడపోస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. ఢిల్లీలో ఆశావహుల హడావిడి
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు ఎవరికి వస్తాయనే ఉత్కంఠ పెరిగిపోయింది. మొన్నటి వరకు హైదరాబాద్ గాంధీ భవన్ చుట్టూ తిరిగిన ఆశావహులు.. ఇప్పుడు ఢిల్లీ బాట పట్టారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 1000కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. వీరిలో నుంచి ప్రదేశ్ ఎన్నికల కమిటీ కొంత మందిని వడపోసి స్క్రీనింగ్ కమిటీకి లిస్టు ఇచ్చింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్, తాజ్ కృష్ణలో మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ సమావేశమై.. చివరకు 300 మందిని వడపోసింది. ఇప్పుడు వీరి నుంచే తుది అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.

స్క్రీనింగ్ కమిటీ ఇప్పుడు ఢిల్లీలో సమావేశమై వడపోత కార్యక్రమం మొదలు పెట్టింది. తొలి విడతలో 40 సీట్లకు టికెట్లు ప్రకటించాలని భావిస్తోంది. చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన సభ్యులు జిగ్నేష్ మేవానీ, బాబా సిద్ధికితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి తదితరులు పాల్గొన్నారు. బుధవారం స్క్రీనింగ్ కమిటీ భేటీ అర్ధాంతరంగా ముగిసింది. మురళీధరన్‌తో పాటు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎంపీలుగా ఉన్నారు. బుధవారం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతుండటంతో వీళ్లు అభ్యర్థుల వడపోతను పక్కన పెట్టి లోక్‌సభకు హాజరయ్యారు.

గురువారం సుదీర్ఘంగా స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. విషయం తెలుసుకున్న పలువురు ఆశావహలు ఢిల్లీ చేరుకున్నారు. తమకు టికెట్లు వచ్చేలా పలు మార్గాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. టికెట్లు ఆశిస్తున్న మల్‌రెడ్డి రాంరెడ్డి, కైలాశ్ నేత, సర్వే సత్యనారాయణ వంటి నాయకులు ఢిల్లీలో ఉన్నారు. తమకు టికెట్లు దక్కేలా పలువురు కీలక నేతలను సంప్రదిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఠాక్రేను కలిసేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నించారు.

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ స్థానంపై ఢిల్లీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రచార కమిటీ చైర్మన్‌గా, స్క్రీనింగ్ కమిటీలో ఉన్న మధు యాష్కి ఈ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. అదే సమయంలో మల్‌రెడ్డి రాంరెడ్డి ఎల్బీనగర్ టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఢిల్లీలో వీరిద్దరి అనుచరులు పోటాపోటీగా ప్రదర్శన చేస్తున్నారు. తమ నాయకుడికే టికెట్ వస్తుందని వారు బాహాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. నాన్-లోకల్ అయిన మధు యాష్కికి ఇవ్వొద్దని వారు గట్టిగా చెబుతున్నారు.

శుక్రవారం కూడా సుదీర్ఘంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగే అకాశం ఉన్నది. తొలి విడతలో 40 మంది అభ్యర్థులను ఎంపిక చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తారని తెలుస్తున్నది. ఆ లిస్టును కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలించిన తర్వాత తొలి విడత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  22 Sept 2023 8:45 AM IST
Next Story