బీఆర్ఎస్ నేతలొస్తున్నారు.. కండువాలతో కాంగ్రెస్ సిద్ధం!
బీఆర్ఎస్‌ను గద్దె దింపాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ టికెట్లు దక్కని నేతలొస్తే పార్టీలోకి ఆహ్వానించేందుకు కండువాలతో సిద్ధంగా ఉంది.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఒకేసారి దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాలకు (నాలుగు మినహా) అభ్యర్థులను ప్రకటించింది. టికెట్లు దొరకని సిటింగ్‌లు, ఎప్పటి నుంచో టికెట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన నేతలు, టికెట్ దొరక్క భంగపడిన వారు భవిష్యత్తుపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఎలాగైనా ఈసారి బీఆర్ఎస్‌ను గద్దె దింపాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ టికెట్లు దక్కని నేతలొస్తే పార్టీలోకి ఆహ్వానించేందుకు కండువాలతో సిద్ధంగా ఉంది.
రేఖానాయక్‌తో షురూ
ఖానాపూర్ టికెట్ దక్కకపోవడంతో రేఖానాయక్ బీఆర్ఎస్‌కు టాటా చెప్పేసి కాంగ్రెస్‌లోకి వెళ్లబోతున్నారు. ముందుగా ఆమె భర్త శ్యామ్‌నాయక్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రేఖానాయక్‌కు ఖానాపూర్, శ్యామ్‌నాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్లు ఖాయమైపోయాయని చెబుతున్నారు.
నకిరేకల్‌లో వేముల వీరేశం!
నకిరేకల్‌లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన చిరుమర్తి లింగయ్యకే బీఆర్ఎస్ ఈసారి టికెటిచ్చింది. దీంతో ఇక్కడ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత వేముల వీరేశానికి నిరాశే మిగిలింది. తనను ఓడించిన చిరుమర్తిని కేసీఆర్ దగ్గరకు తీసినప్పుడు తాను కాంగ్రెస్‌లోకి వెళితే తప్పేమిటన్న ఆలోచనలో ఆయన ఉన్నారని చెబుతున్నారు. తమ సిటింగ్ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ తీసుకెళ్లింది కాబట్టి వీరేశాన్ని తమ పార్టీలో చేర్చుకుని టికెటిస్తే లెక్క సరిపోతుందని కాంగ్రెస్ కండువాతో సిద్ధంగా ఉంది. ఈ మేరకు పార్టీ సీనియర్లు ప్రయత్నాలు ప్రారంభించారు.
తుమ్మల చేయందిస్తారా?
మరోవైపు సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టికెట్ దక్కకపోవడంతో అయోమయంలో పడ్డారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఏ మాత్రం బలం లేకపోవడంతో పార్టీ మారాలంటే ఇప్పుడు తుమ్మల ముందున్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ ఒక్కటే. ఆయన అభిమానులు కూడా అదే మాట బలంగా చెబుతున్నారు. తుమ్మల ఏమంటారో తెలియకున్నా.. అక్కడ కూడా కాంగ్రెస్ ఆయన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఇలాంటి నేతలు ఎంత మంది ఉన్నారో అని లెక్కేస్తున్న కాంగ్రెస్, వాళ్లందరినీ పార్టీలోకి తెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
*