Telugu Global
Telangana

సీపీఐ, సీపీఎంతో పొత్తుకు కాంగ్రెస్‌ రెడీ.. చెరో రెండు సీట్లు!

అసెంబ్లీ ఎన్నికల కోసం రెడీ అవుతున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇదే టైమ్‌లో సీపీఎం, సీపీఐతో పొత్తులపైనా దృష్టిపెట్టింది.

సీపీఐ, సీపీఎంతో పొత్తుకు కాంగ్రెస్‌ రెడీ.. చెరో రెండు సీట్లు!
X

తెలంగాణలో కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీల పొత్తు అంశంపై చర్చలు ఫైనల్ స్టేజికి చేరినట్లు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే లెఫ్ట్ పార్టీలు మాత్రం తమకు చెరో మూడు సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు స‌మాచారం. త్వరలోనే పొత్తులపై రెండు పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే సీట్లపై క్లారిటీ వచ్చిన తర్వాతే పొత్తు ప్రకటన చేయాలని లెఫ్ట్ పార్టీల నేతలు భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల కోసం రెడీ అవుతున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇదే టైమ్‌లో సీపీఎం, సీపీఐతో పొత్తులపైనా దృష్టిపెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న హస్తం పార్టీ.. ఏ చిన్న అవకాశాన్ని వదులుకొవద్దని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నేతృత్వంలో లెఫ్ట్ పార్టీల బలాబలాలపై సర్వే చేయించినట్లు సమాచారం. సర్వేలో పాజిటివ్‌ ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లెఫ్ట్‌ పార్టీలతో పొత్తుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై ఢిల్లీ స్థాయిలోనే చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎంకు చెరో రెండు స్థానాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సీపీఎంకు మిర్యాలగూడ, పాలేరు.. సీపీఐకి మునుగోడు, హుస్నాబాద్‌ లేదా బెల్లంపల్లి స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెప్తున్నారు. అయితే భద్రాచలం స్థానం కోసం సీపీఎం, కొత్తగూడెం స్థానం కోసం సీపీఐ పట్టుబడుతున్నట్లు సమాచారం. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

First Published:  9 Oct 2023 5:13 AM GMT
Next Story