ప్రగతిభవన్ ను బద్దలు కొట్టడం, "ధరణి" ని రద్దు చేయడంపై కాంగ్రెస్ విధానం స్పష్టం చేయాలి -KTR
గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ధరణి పోర్టల్ అంశంపై పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, కాంగ్రెస్ సభ్యుడు డి. శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం జరిగింది.
'ప్రగతిభవన్ ను బద్దలు కొట్టడం, "ధరణి" ని రద్దు చేయడం కాంగ్రెస్ విధానమా?'
ప్రగతిభవన్ ను నక్సలైట్లు పేల్చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. ధరణి పోర్టల్ ను రద్దుచేయాలంటూ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. ఈ రెండువిషయాలపై కాంగ్రెస్ పార్టీ విధానమేంటని కేటీఆర్ ప్రశ్నించారు.
గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ధరణి పోర్టల్ అంశంపై పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, కాంగ్రెస్ సభ్యుడు డి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం జరిగింది.
బడ్జెట్ చర్చలో శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో చాలా లోపాలు ఉన్నాయని, దీని వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందున ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆరోపించారు. శ్రీధర్‌బాబు వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇప్పటివరకు 23.9 లక్షలకుపైగా డాక్యుమెంట్లు ఎలాంటి సమస్య లేకుండా పోర్టల్‌లో అప్‌లోడ్ అయ్యాయని, భూములు, ఆస్తులకు సంబంధించిన అన్ని సమస్యలను కొద్ది నిమిషాల్లోనే పరిష్కరించగలిగామని, ఈ విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు కేటీఆర్.
“కాంగ్రెస్ ఇప్పుడు దానిని రద్దు చేయాలని కోరుతోంది. ఇది ఎలాంటి మనస్తత్వం?" బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను వ్యతిరేకించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన అన్నారు.
“కాంగ్రెస్ ఎల్లప్పుడూ విధ్వంసానికి మద్దతు ఇస్తుంది. ప్రగతి భవన్‌ను గ్రెనేడ్‌లతో పేల్చివేయాలని వాళ్ళ అధ్యక్షుడు కోరుకుంటాడు. ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కోరుతున్న సభ్యుడు ఇక్కడ ఉన్నారు. ధరణి పోర్టల్, ప్రగతి భవన్ ధ్వంసంపై కాంగ్రెస్ తమ వైఖరిని స్పష్టం చేయాలని మేము కోరుకుంటున్నాము, ”అని ఆయన అన్నారు. టిపిసిసి చీఫ్ ఎ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఆర్టిఐని ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు.
వాదన అంతటితో ఆగలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు కోసం రైతుల నుంచి ఎకరా రూ.8 లక్షలకు భూములు కొనుగోలు చేసి ఎకరం రూ.1.8 కోట్లకు కార్పొరేట్ సంస్థలకు విక్రయించిందని శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఆగ్రహించిన కేటీఆర్ శ్రీధర్‌బాబు తన ఆరోపణలను నిరూపించాలని, లేకుంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రభుత్వానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. “మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వం ముందు ఉంచండి. తప్పుడు ఆరోపణలు చేయవద్దు. మేము దానిని తేలికగా తీసుకోము, ”అని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క గజం భూమిని కూడా ఎవరికీ విక్రయించలేదని, శ్రీధర్ బాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేదా అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. అయితే, శ్రీధర్ బాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే బదులు, “నేను చెప్పిన మాటలు నిజంకాకపోతే నేను సరిదిద్దుకుంటాను” అని చెప్పాడు. దీంతో స్పీకర్ శ్రీధర్ బాబు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించారు.