Telugu Global
Telangana

దీని మీద కూడా నిరసనా?.. కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు

కాంగ్రెస్ నిరసనపట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించాలని చెప్పడం కూడా తప్పేనా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

దీని మీద కూడా నిరసనా?.. కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు
X

హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు కొత్త కాదు. వాహనదారులు కూడా ఎక్కడా ట్రాఫిక్ ఆంక్షలు పాటించరు. రాంగ్ రూట్ లలో వెళ్లడం.. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయడం.. రోడ్ల మీద పార్కింగ్ చేయడం ఇక్కడ పరిపాటి. ఇక ఫుట్ పాత్ ల మీద దుకాణాలు కూడా మామూలే.. దీంతో భాగ్యనగరంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ కొనసాగుతూ ఉంటుంది. పెరిగిన జనాభా.. పెరిగిన వాహనాలు ఇందుకు ఒక కారణం అయితే.. వాహనదారుల నిర్లక్ష్య ధోరణి మరో కారణం.

ఇదిలా ఉంటే ఇటీవల ట్రాఫిక్ ను కట్టడి చేసేందుకు హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాంగ్ రూట్లో వెళ్లే వాళ్లకు, ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘించే వారికి ఎక్కడికక్కడ చలాన్లు వేస్తున్నారు. ఇది ఎప్పటినుంచో ఉన్నదే.. అయితే ఇటీవల కాస్త ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచారు. కాగా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శ కూడా ఉంది.

తాజాగా ట్రాఫిక్ పోలీసుల తీరుపై మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలోని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు.. భారీ సంఖ్యలో సీపీ కార్యాలయానికి చేరుకొనేందుకు ప్రయత్నించారు. వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగరంలో రోడ్లను కూడా సరిగ్గా వేయలేకపోతుంది గానీ.. సామాన్యులను ట్రాఫిక్ చలాన్ల పేరుతో ఎందుకు వేధిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు.అయితే కాంగ్రెస్ నిరసనపట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించాలని చెప్పడం కూడా తప్పేనా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేవారే ట్రాఫిక్ ఆంక్షలు పాటించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

First Published:  22 Nov 2022 1:43 AM GMT
Next Story