Telugu Global
Telangana

అదానీకి వ్యతిరేకంగా రేవంత్ నిరసన.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపడంతో పాటు సెబీ ఛైర్మన్ అక్రమాలపై విచారణ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని, సెబీ ఛైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టనున్నారు.

అదానీకి వ్యతిరేకంగా రేవంత్ నిరసన.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
X

ఆల్‌ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ అదానీకి వ్యతిరేకంగా టీపీసీసీ నిరసన తెలపనుంది. ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీతో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపడంతో పాటు సెబీ ఛైర్మన్ అక్రమాలపై విచారణ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని, సెబీ ఛైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టనున్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ నుంచి ప్రారంభం కానున్న నిరసన ర్యాలీ ఈడీ ఆఫీసు ముందు ధర్నాతో ముగియనుంది.


అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా చేపట్టడంపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి, ఆయన బృందం అదానీకి వ్యతిరేకంగా నిరసన తెలపడం ఈ సంవత్సరంలోనే అతిపెద్ద జోక్ అన్నారు. అదానీని ఆహ్వానించి, అతనిని ఆలింగనం చేసుకుని, ఒప్పందాలు చేసుకుని, ప్రోత్సాహకాలు ఇచ్చి.. చివరకు మోసగాడు అని ఆరోపిస్తున్నారన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌ నేతలు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతుండాలి లేదా దేశాన్ని మోసం చేయాలని భ్రమపడుతుండాలి అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణలో రూ. 12 వేల 400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్‌ అంగీకరించిందని సీఎం రేవంత్ చెప్పారు. అయితే ఇప్పుడు అదానీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

First Published:  22 Aug 2024 7:52 AM IST
Next Story