Telugu Global
Telangana

సింగరేణి నష్టాలకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత : సీఎం కేసీఆర్

సింగరేణి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం వద్ద సింగరేణిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని కేసీఆర్ చెప్పారు.

సింగరేణి నష్టాలకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత : సీఎం కేసీఆర్
X

సింగరేణి నష్టాలకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత : సీఎం కేసీఆర్

సింగరేణి సంస్థ నష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం. వారి పాలనలోనే సింగరేణి నష్టాల్లోకి వెళ్లిందని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రస్ పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయాలు, నష్టాలను ప్రజలకు వివరించారు.

ఒకప్పుడు సింగరేణి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం వద్ద సింగరేణిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని కేసీఆర్ చెప్పారు. ఆ అప్పులు తీర్చలేక సింగరేణిలో 49 శాతాన్ని కేంద్రానికి రాసిచ్చింది. దీని వల్లే ఇవ్వాళ సింగరేణిపై కేంద్రం కూడా పెత్తనం చెలాయిస్తోందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి టర్నోవర్ కేవలం రూ.11 వేల కోట్లు మాత్రమే ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అంతకు ఎన్నో రెట్లు పెరిగిందని కేసీఆర్ అన్నారు. సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లా అయ్యేదే కాదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెంను జిల్లాను చేసి, మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేసిందని కేసీఆర్ చెప్పారు.

కొత్తగూడెం నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చాము. కాంగ్రెస్ పాలనలో కానిది.. బీఆర్ఎస్ చేసి చూపిచ్చిందని కేసీఆర్ చెప్పారు. సీతారామ ప్రాజెక్టు కూడా 70 శాతం పూర్తయ్యింది. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ రోజే తానే వచ్చి సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తానని చెప్పారు.

ఎన్నికలు రాగానే తెలంగాణలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యర్థులను విమర్శించేందుకు బూతులు తిట్టడానికి కూడా వెనకాడటం లేదు. అంతే కాకుండా ఎన్నో అబద్దాలు చెబుతూ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి, అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటేయాలని కేసీఆర్ కోరారు.

కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతీ అభ్యర్థి వెనుక ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ చరిత్ర చూసి, వివేకంతో ఓటు వేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

First Published:  5 Nov 2023 6:15 PM IST
Next Story