మొన్న అభ్యర్థి, నిన్న కమిటీలు.. స్పీడ్ పెంచిన కాంగ్రెస్..
ప్రచార కమిటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలకంగా ఉండటం విశేషం. మునుగోడు ప్రచార బాధ్యతలు మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డికి అప్పగించినట్టు ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. అధికార పార్టీ కంటే ముందే అభ్యర్థిని ఖరారు చేసింది. ఇప్పుడు ప్రచార కమిటీలను కూడా ప్రకటించి మరింత దూకుడుగా వెళ్తున్నట్టు సంకేతాలు పంపించింది. ప్రచార కమిటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలకంగా ఉండటం విశేషం. మునుగోడు ప్రచార బాధ్యతలు మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డికి అప్పగించినట్టు ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీచేస్తుంటే, అన్న వెంకట్ రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి ప్రచారం చేయబోతున్నారు.
అందరి ఆమోదంతోనే..
మునుగోడు ఉప ఎన్నికకు అందరినీ సంప్రదించాకే అభ్యర్ధిని ప్రకటించామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఐదు దశాబ్దాలు పార్టీకి సేవ చేసిన గాంధీ కుటుంబ సన్నిహితుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సేవలు దృష్టిలో పెట్టుకొని స్రవంతిని అభ్యర్ధిగా ప్రకటించామన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ అకారణంగా ఎన్నిక తెచ్చాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్ ని దెబ్బతీయాలని చేస్తున్న కుట్రల్ని ప్రజలకు వివరిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
మండలాల వారీగా ఇన్ చార్జ్ లు..
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఈ గెలుపుతో ఆత్మవిశ్వాసం నింపుకోవాలని భావిస్తోంది. ఈ ఉప ఎన్నిక కోసం మండలాల వారీగా ఇన్ చార్జ్ లను కూడా ప్రకటించారు రేవంత్ రెడ్డి. మునుగోడుకు మల్లు భట్టి విక్రమార్క, చండూర్ కు షబ్బీర్ అలీ, గట్టుప్పల్ కు వి.హనుమంతరావు, నాంపల్లికి దామోదర రాజనర్సింహ, చౌటుప్పల్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీకి గీతారెడ్డి, మర్రిగూడకు శ్రీధర్ బాబు, నారాయణపురంకి రేవంత్‌రెడ్డి ఇన్ చార్జ్ లు గా ఉంటారు. 10 బూత్ లకి ఒకరిని ఇన్ చార్జ్ గా నియమిస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి ఈ టీమ్ లన్నీ నియోజకవర్గంలో ప్రచార హోరు పెంచుతాయి.