కాంగ్రెస్ బస్సు యాత్ర-2.. ఏ జిల్లాల్లో అంటే..?
ఉత్తర తెలంగాణలో బస్సు యాత్రకు మంచి స్పందన రావడంతో ఇప్పుడు దక్షిణ తెలంగాణలోనూ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ.
ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలిచి, అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్.. రెండో దశ విజయభేరీ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అక్టోబర్ 18న ములుగులో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జెండా ఊపి ప్రారంభించిన మొదటి దశ బస్సు యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఉత్తర తెలంగాణలో బస్సు యాత్రకు మంచి స్పందన రావడంతో ఇప్పుడు దక్షిణ తెలంగాణలోనూ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ.
సెకండ్ ఫేజ్ బస్సు యాత్ర ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలను కవర్ చేసేలా పార్టీ నేతలు రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. అయితే సెకండ్ ఫేజ్ బస్సు యాత్రకు రాహుల్, ప్రియాంక గాంధీ కాకుండా.. AICC చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక,రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు ముఖ్యనేతలను ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
తెలంగాణలో నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 3 తర్వాతే రెండో దశ బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.