Telugu Global
Telangana

మరో 4 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాక్‌

భువనగిరి నుంచి సీఎం రేవంత్‌ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అవకాశం ఇచ్చింది. దీంతో ఈ విషయంలో రేవంత్ తన పంతం నెగ్గించుకున్నట్లయింది.

మరో 4 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాక్‌
X

తెలంగాణలో మరో నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. మెదక్‌, భువనగిరి, నిజామాబాద్‌, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బుధవారం జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ నాలుగు స్థానాలపై ఏకాభిప్రాయం కుదరడంతో అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా ఇప్పటివరకూ 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌.. మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.

భువనగిరి నుంచి సీఎం రేవంత్‌ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అవకాశం ఇచ్చింది. దీంతో ఈ విషయంలో రేవంత్ తన పంతం నెగ్గించుకున్నట్లయింది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ భువనగిరి నుంచి బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించగా.. అధిష్టానం ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. 2019లో కాంగ్రెస్ గెలిచిన 3 స్థానాల్లో భువనగిరి ఒకటి. ఇక నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలో నిలిపింది. నెల రోజుల క్రితం పార్టీలో చేరిన నీలం మధుకు మెదక్‌ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆదిలాబాద్ స్థానంలో ఆత్రం సుగుణకు ఛాన్స్‌ ఇచ్చింది.

ఇక హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ స్థానాలపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రియాంకను మరోసారి కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రియాంక అభిప్రాయం వెల్లడించిన తర్వాత ఖమ్మం అభ్యర్థిపై స్పష్టత రానుంది. కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్‌ కుమార్, వెలిచాల రవీందర్ రావుతో పాటు తీన్మార్ మల్లన్న టికెట్ ఆశిస్తున్నారు. దీంతో మరోసారి సర్వే నిర్వహించి అభ్యర్థి ఎంపికపై అంచనాకు రానున్నారు. వరంగల్ స్థానానికి దొమ్మాట సాంబయ్య పేరును పీసీసీ ప్రతిపాదించగా.. ఇటీవల పార్టీలో చేరిన ఎంపీ పసునూరి దయాకర్ సహా మరికొందరు పేర్లను కాంగ్రెస్‌ హైకమాండ్ పరిశీలించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

First Published:  28 March 2024 8:32 AM IST
Next Story