వలస వచ్చిన నేతలే గెలుపు గుర్రాలవుతారా..? కాంగ్రెస్ లెక్కేంటి..?
కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా సేవచేస్తూ ఎప్పటికైనా టికెట్ దక్కుతుందని ఆశిస్తున్న వారికి ఈ నియోజకవర్గాల్లో నిరాశే మిగిలింది. వారు సహాయ నిరాకరణ చేస్తే, తమ వర్గం వారితో ఆ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేయిస్తే కాంగ్రెస్ వ్యూహం రివర్స్ కొట్టే ప్రమాదం పొంచి ఉంది.
ఎట్టకేలకు కాంగ్రెస్ 55 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. అయితే ఇందులో దాదాపు 20 శాతం మంది ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలే కావడం గమనార్హం. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని ఇతర పార్టీల్లో టికెట్లు దొరక్క, అడిగినన్ని స్థానాలివ్వకపోవడంతో అలకబూనిన నేతలే కాంగ్రెస్‌లోకి వచ్చిచేరారు. అలాంటివారిలో ఏకంగా 9 మందికి హస్తం టికెట్లిచ్చింది.
మైనంపల్లి నుంచి జూపల్లి వరకు 9 మంది
తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని అలిగి, అందర్నీ తిట్టి బీఆర్ఎస్‌లో నుంచి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు, ఆయన కోరుకున్నట్లు కుమారుడు రోహిత్‌కు కాంగ్రెస్ రెండు టికెట్లిచ్చింది. అలాగే బీఆర్ఎస్ నుంచి చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, నకిరేకల్‌లో వేముల వీరేశానికి, నిర్మల్‌లో శ్రీహరిరావుకు, నాగర్ కర్నూలులో రాజేశ్‌రెడ్డికి ఇలా అత్యధిక మంది బీఆర్ఎస్ నుంచి చేరినవారికి టికెట్లు కేటాయించింది. ఎమ్మెల్యేలుగా, కీలక నేతలుగా గులాబీదళంలో వారికున్న ఫాలోయింగ్‌తో వారంతా గెలుపు గుర్రాలవుతారని హస్తం పార్టీ ఆశిస్తోంది.
రివర్స్ కొడితే ఏంటి పరిస్థితి..?
కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా సేవచేస్తూ ఎప్పటికైనా టికెట్ దక్కుతుందని ఆశిస్తున్న వారికి ఈ నియోజకవర్గాల్లో నిరాశే మిగిలింది. వారు సహాయ నిరాకరణ చేస్తే, తమ వర్గం వారితో ఆ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేయిస్తే కాంగ్రెస్ వ్యూహం రివర్స్ కొట్టే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి వారిని బుజ్జగించి దగ్గరకు తీసేందుకు గులాబీ దళం కూడా పావులు కదుపుతుందని రాజకీయవర్గాల విశ్లేషణ. ఈ 9 నియోజకవర్గాల్లో మున్ముందు ఎలాంటి అసంతృప్తులు బయలుదేరతాయోనని కాంగ్రెస్‌లో కూడా గుబులు ఉన్నా.. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదరిస్తోంది. నిజంగా వాళ్లు గెలిచే అభ్యర్థులయితే బీఆర్ఎస్ ఎందుకు వదులుకుంటుందని కాంగ్రెస్ శ్రేణులు తమలో తాము ప్రశ్నించుకుంటున్నాయి.