దీక్షా దివస్ నిర్వహణపై కాంగ్రెస్ అభ్యంతరం.. ఈసీకి లేఖ
పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించిందని లేఖలో పేర్కొంది కాంగ్రెస్. కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది.
తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు నవంబర్ 29. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో గులాబీ బాస్ కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షను చేపట్టిన రోజు. దీంతో ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే దీక్షా దివస్ నిర్వహణపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉండగా దీక్షా దివస్‌కు పిలుపునిచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిబంధనలు ఉల్లంఘించారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ లేఖ రాశారు. ఇక ఓ మీడియా ఛానల్‌లో 2009లో కేసీఆర్ దీక్షకు సంబంధించిన దృశ్యాలు చూపించారని లేఖలో తెలిపారు.
పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించిందని లేఖలో పేర్కొంది కాంగ్రెస్. కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. వెంటనే దీనిపై సరైన చర్యలు తీసుకోవాలని ఈసీని లేఖలో కోరింది కాంగ్రెస్.