Telugu Global
Telangana

రైతు భరోసాపై వారంతా ఆశలు వదులుకోవాల్సిందే..

రైతుబంధుని, రైతు భరోసాగా మారుస్తూ మేనిఫెస్టోలో కీలక హామీ ఇచ్చింది కాంగ్రెస్. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా సాయమందిస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చాక మాత్రం ఇంకా విధి విధానాల ఖరారు దగ్గరే ఆగిపోయింది.

రైతు భరోసాపై వారంతా ఆశలు వదులుకోవాల్సిందే..
X

రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దీనిపై కాంగ్రెస్ నేతలు హింటిచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ఆలోచనను పట్టాలెక్కిస్తున్నారు. కేవలం అర్హులకు, అంటే వ్యవసాయం చేసేవారికి మాత్రమే రైతు భరోసా సాయం అందిస్తామని స్పష్టం చేశారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరలోనే రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించి, అసెంబ్లీలో చర్చించి నూతన విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారాయన.

బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం ద్వారా పొలం ఉన్న ప్రతి రైతుకీ పెట్టుబడి సాయం అందేది. రైతు బీమా కూడా వారికే దక్కేది. అయితే పొలం ఉంటే చాలు, దాన్ని సాగుచేయకపోయినా రైతుబంధు సొమ్ములు బ్యాంకుల్లో జమ అయ్యేవి. అనర్హులకు కూడా రైతుబంధు పడుతోందనే విమర్శలు వచ్చినా.. కొందరు స్వచ్ఛందంగా ఆ సాయాన్ని వద్దనుకున్నారు. మరికొందరు మాత్రం సాగు చేయకపోయినా, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారయినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధుని మాత్రం వదులుకునేవారు కాదు. ఇకపై ఇలా అనర్హులకు లబ్ధి చేకూరదు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రైతుబంధుని, రైతు భరోసాగా మారుస్తూ మేనిఫెస్టోలో కీలక హామీ ఇచ్చింది కాంగ్రెస్. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా సాయమందిస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చాక మాత్రం ఇంకా విధి విధానాల ఖరారు దగ్గరే ఆగిపోయింది.

నిన్న మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉందని చెప్పారు నేతలు. ఇప్పుడు కోడ్ తొలగిపోవడంతో సంప్రదింపులు, సమీక్షలు అంటూ మరికొంతకాలం గడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక రైతు రుణమాఫీ విషయంలో కూడా వ్యవసాయ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 లక్షల చొప్పున పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారని, విడతల వారీగా మాఫీ చేయటం వల్ల ఆ సొమ్ము వడ్డీకే సరిపోతుందనే భావన రైతుల్లో ఉందని చెప్పారు. రుణమాఫీ విషయంలో కూడా త్వరలో విధివిధానాలు రూపొందిస్తామన్నారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల పంట రుణమాఫీ అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు తుమ్మల.

First Published:  15 Jun 2024 1:21 AM GMT
Next Story