Telugu Global
Telangana

మహిళా బిల్లుకి మొహం చాటేసిన కాంగ్రెస్ ఎంపీలు

కాంగ్రెస్ ఎంపీలు.. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ముగ్గురూ మహిళా బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో లోక్ సభకు డుమ్మా కొట్టారు, ఢిల్లీలో ఉండి కూడా లోక్ సభ బయటే ఉండిపోయారు. ఓటింగ్ లో పాల్గొనలేదు.

మహిళా బిల్లుకి మొహం చాటేసిన కాంగ్రెస్ ఎంపీలు
X

మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. లోక్ సభలో ఈ బిల్లుకి 454మంది అనుకూలంగా ఓటు వేయగా ఇద్దరు వ్యతిరేకించారు. రాజ్యసభకు హాజరైన మొత్తం 214మంది బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారు. లోక్ సభలో ఉండి కూడా ఓటు వేయని వారు ఎంఐఎం ఎంపీలు, లోక్ సభకు రాకుండా డుమ్మాకొట్టినవారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. అవును, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు.. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ముగ్గురూ మహిళా బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో లోక్ సభకు డుమ్మా కొట్టారు, ఢిల్లీలో ఉండి కూడా లోక్ సభ బయటే ఉండిపోయారు. ఓటింగ్ లో పాల్గొనలేదు.

వాస్తవానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా సరంజామాతో బయలుదేరారు. అయితే వారికి మహిళా బిల్లుకంటే సొంత పార్టీ టికెట్ల వ్యవహారమే ఎక్కువ ప్రయారిటీ అయింది. అందుకే వారు పార్లమెంట్ లో మహిళా బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో పార్టీ మీటింగ్ లు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ థాక్రే అపాయింట్ మెంట్ ఉండటంతో వారంతా స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొనడానికి వెళ్లారు. సరిగ్గా లోక్ సభలో ఓటింగ్ సమయానికే స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ షెడ్యూల్ ఉంది. అనుకోకుండా ఆ మీటింగ్ క్యాన్సిల్ కావడంతో తిరిగి వారంతా ఓటింగ్ కి బయలుదేరారు. అప్పటికే ఆలస్యమైంది. సాయంత్రం 6గంటలకు ఓటింగ్ మొదలు కాగా.. 6.30 గంటలకు ముగ్గురు ఎంపీలు లోక్ సభకు చేరుకున్నారు. కానీ లోపలికి వెళ్లలేదు. ఓటింగ్ లో పాల్గొనలేదు.

మహిళా బిల్లు లోక్ సభ ముందుకు వచ్చిన సందర్భంగా సోనియా గాంధీ ఉద్వేగభరిత ప్రసంగం ఇచ్చారు. ఇది రాజీవ్ గాంధీ కల అని అభివర్ణించారు. తమ హయాంలోనే మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లిచ్చామని గుర్తు చేసుకున్నారు. అంతా చేసిన సోనియా.. తమ పార్టీ ఎంపీలు అసలు సభకు హాజరయ్యారో లేదో చూసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ విప్ కూడా జారీ చేయలేదు. దీంతో తెలంగాణకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఓటింగ్ కి డుమ్మాకొట్టారు.

First Published:  23 Sept 2023 7:14 AM GMT
Next Story