Telugu Global
Telangana

రాహుల్ కి జైలుశిక్ష పడిన రోజే మోదీని కలసిన కోమటిరెడ్డి

మోదీని కలసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి.. అన్ని విషయాలు మీతో పంచుకోలేనంటూ సస్పెన్స్ మెయింటెన్ చేశారు.

రాహుల్ కి జైలుశిక్ష పడిన రోజే మోదీని కలసిన కోమటిరెడ్డి
X

సూరత్ కోర్ట్ రాహుల్ గాంధీకి జైలు శిక్ష వేసిన సందర్భంలో బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కావాలనే రాహుల్ పై పరువునష్టం దావా వేసి జైలు శిక్ష పడేలా చేశారని అంటున్నారు. మోదీ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని శాపనార్థాలు పెడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. బీజేపీ మంత్రులతో భేటీ కావడం, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అడగటం వెంకట్ రెడ్డికి అలవాటే. అయితే సరిగ్గా రాహుల్ విషయంలో బీజేపీపై కాంగ్రెస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున వేళ, మోదీకి కరచాలనం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందరిటీ టార్గెట్ అయ్యారు.

కొన్ని రహస్యాలుంటాయి..

మోదీని కలసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి.. అన్ని విషయాలు మీతో పంచుకోలేనంటూ సస్పెన్స్ మెయింటెన్ చేశారు. తన నియోజకవర్గంలో జాతీయ రహదారుల నిర్మాణంపై మోదీతో చర్చించానని పేర్కొన్నారాయన. ఎల్బీ నగర్ నుంచి మెట్రో రైల్‌ పొడిగింపు ప్రతిపాదనలు అందించానన్నారు. కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివి కూడా ఉంటాయన్నారు.

ప్రధానికి థ్యాంక్స్..

తాను చెప్పిన అన్ని అంశాల పట్ల ప్రధాని మోదీ చాలా సానుకూలంగా స్పందించారన్నారు ఎంపీ కోమటిరెడ్డి. రెండు, మూడు నెలలలో అన్ని మంజూరు చేసే అవకాశం ఉందని వివరించారు. ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. తెలంగాణలో వడగండ్ల వానతో రైతులు నష్ట పోయారని, కేంద్రం నుంచి పరిశీలనకు బృందాన్ని పంపాలని కోరానన్నారు కోమటిరెడ్డి.

తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్స్ గా ముద్రపడిన కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు ఆల్రడీ బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నా, సమాధానం చెప్పుకుని సర్దుకుపోయారు. కాంగ్రెస్ ఒంటరిగా తెలంగాణలో అధికారంలోకి రాలేదని చెప్పి ఇటీవల మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు, ఆ తర్వాత కవర్ చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కి పంటికింద రాయిలా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు మోదీతో భేటీతో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చారు.

First Published:  23 March 2023 2:37 PM IST
Next Story