Telugu Global
Telangana

హరీష్ రావు సభలో సీతక్క ఎంట్రీ.. ఏం జరిగిందంటే..?

ఎమ్మెల్యే సీతక్క రాకను చూసి ఆమెను మంత్రి హరీష్ రావు స్టేజ్ పైకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడేందుకు అవకాశం కూడా ఇచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకి కూడా సభలో మాట్లాడేందుకు అవకాశమిచ్చి హుందాగా వ్యవహరించారు హరీష్ రావు.

హరీష్ రావు సభలో సీతక్క ఎంట్రీ.. ఏం జరిగిందంటే..?
X

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు పెద్దగా కనిపించరు. కానీ ములుగు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వేదికపైకి వచ్చారు. ఆమెకు కూడా మాట్లాడే అవకాశమిచ్చారు. మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత పాల్గొన్న ఈ సభలో సీతక్క ఎంట్రీ ఆశ్చర్యం కలిగించినా చివరకు సభ సజావుగా ముగిసింది.

ఘర్షణకోసం రాలేదు..

తాను ఈ సభకు ఘర్షణకోసం రాలేదంటూనే తమ ప్రాంత సమస్యలను ప్రస్తావించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఆలస్యంగా అయినా తమ ప్రాంతానికి మెడికల్ కాలేజీ ఇచ్చినందుకు సంతోషం అన్నారు. ఆ విషయంలో మంత్రి హరీష్ రావుకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మల్లంపల్లిని మండలంగా ప్రకటించినందుకు కూడా ధన్యవాదాలు తెలిపిన సీతక్క.. మండలం కోసం పోరాటం చేసిన జగదీష్ పేరుతో కలిపి జేడీ మల్లంపల్లిగా పేరు మార్చాలని సూచించారు. తమ ప్రాంతానికి గోదావరి జలాలు రాలేదని, ఆ విషయంలో మంత్రులు చొరవ తీసుకోవాలని కోరారు. పోడు భూములకోసం 70ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయని, 2006లో వచ్చిన అటవీ హక్కుల చట్టం సోనియా పుణ్యమేనని అన్నారు సీతక్క. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ శాసన సభ్యుల మాట చెల్లుబాటు అవుతుందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఆ అవకాశం కల్పించాలన్నారు. తమకు కూడా అదే ప్రొటోకాల్ ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.


ఎమ్మెల్యే సీతక్క రాకను చూసి ఆమెను మంత్రి హరీష్ రావు స్టేజ్ పైకి ఆహ్వానించారు. అనంతరం ఆమెకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకి కూడా మాట్లాడేందుకు అవకాశమిచ్చి హుందాగా వ్యవహరించారు హరీష్ రావు. ఎమ్మెల్యే సీతక్క ఎక్కడా రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా, సున్నితంగా సమస్యలను ప్రస్తావించారు. సీతక్క ఎంట్రీ, ఆమె ప్రసంగం ఆసక్తిగా సాగాయి.

First Published:  28 Sept 2023 1:29 PM IST
Next Story