Telugu Global
Telangana

కేసీఆర్‌ కట్టడికి షా మరో ఎత్తుగడ

బీజేపీలో చేరాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించగా రాజగోపాల్ కూడా అందుకు దాదాపు అంగీకారం తెలిపారని చెబుతున్నారు.

కేసీఆర్‌ కట్టడికి షా మరో ఎత్తుగడ
X

తెలంగాణలో కృత్తిమంగానైనా తొలుత తన బలం పెరిగిందన్న భావన కలిగించేందుకు బీజేపీ రకరకాల ఎత్తులు వేస్తోంది. కేసీఆర్‌ తమకు సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో మోడీ, షాలు తెలంగాణపైనే ఈ మధ్య ఎక్కువగా రాజకీయ దృష్టి సారిస్తున్నారు.

ఇందులో భాగంగా కాస్త పేరున్న నేతలకు వలవేస్తోంది బీజేపీ. కాంగ్రెస్‌ నిరుత్సాహపూరిత వాతావరణంలో ఉండడాన్ని ఆధారంగా చేసుకుని ఆ పార్టీ నేతలకు వలవేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగానే కాస్త సొంత బలం కూడా ఉన్న కోమటిరెడ్డి ఫ్యామిలీపై కన్నేశారు కమలనాథులు.

ఇందులోభాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్టు ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ఈ భేటీకి జార్ఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మీడియేటర్‌గా వ్యవహరించారని వార్తలొస్తున్నాయి. దూబేకు, రాజగోపాల్ రెడ్డి మధ్య వ్యాపార సాన్నిహిత్యం ఉంది. బీజేపీలో చేరాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించగా రాజగోపాల్ కూడా అందుకు దాదాపు అంగీకారం తెలిపారని చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సిందిగా అమిత్ షా సూచించినట్టు తెలుస్తోంది. అలా చేస్తే కేవలం నాలుగు నెలల్లోనే ఉప ఎన్నికలు జరిగేలా చూస్తానని.. తానే స్వయంగా ప్రచారానికి కూడా వస్తానని అమిత్ షా హామీ ఇచ్చారని కథనాలొస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక జరిగేలా చూస్తానని షా హామీ ఇచ్చారని చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కుటుంబానికి పొసగడం లేదు. రాజగోపాల్‌ను బీజేపీలోకి తీసుకుని ఉప ఎన్నిక తెస్తే.. సీఎం కేసీఆర్‌ ఈ ఉప ఎన్నికల మీదే దృష్టి పెట్టేలా కట్టడి చేయవచ్చన్న ఆలోచనతోనే అమిత్ షా ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు సమయం, అవకాశం లేకుండా రాష్ట్రంలోనే కేసీఆర్‌ బిజీ అయ్యేలా చేయాలన్న ఎత్తుగడ బీజేపీ పెద్దలది అని అనుమానిస్తున్నారు.

First Published:  22 July 2022 6:56 AM IST
Next Story