Telugu Global
Telangana

వైఎస్ షర్మిలకు ఆప్షన్ లేకుండా చేసిన కాంగ్రెస్.. పొత్తు ఉండదు.. విలీనమే దారా?

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు గమనిస్తే.. చిన్న పార్టీలకు స్థానమే లేనట్లుగా కనపడుతున్నది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వైఎస్ షర్మిలకు ఆప్షన్ లేకుండా చేసిన కాంగ్రెస్.. పొత్తు ఉండదు.. విలీనమే దారా?
X

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం పూర్తి కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. 2021 ఫిబ్రవరి 9న పార్టీని అట్టహాసంగా ప్రకటించిన తర్వాత.. తెలంగాణలో పాదయాత్ర చేశారు. ఊరూరా తిరుగుతూ అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలపై పరుష పదజాలం వాడటంతో పోలీసులు కేసులు కూడా పెట్టారు. అయినా సరే తన దూకుడు తగ్గించలేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు.

కానీ, ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు గమనిస్తే.. చిన్న పార్టీలకు స్థానమే లేనట్లుగా కనపడుతున్నది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీకి తెలంగాణలో పెద్దగా బలం లేదని.. అది పోటీకి దిగినా నామ మాత్రమే అవుతుందని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దూకుడు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్.. ఇతర పార్టీల్లో ఉన్న పలువురు నాయకులను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయంలో బీజేపీ పూర్తిగా వెనుకబడింది. అదే సమయంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించారు.

ఇటీవల బెంగళూరు వెళ్లిన షర్మిల.. డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆమె కోరినట్లు సమాచారం. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా షర్మిల పార్టీతో పెట్టుకోవాలని కాంగ్రెస్‌ను కోరారు. పాలేరు సీటు ఆమెకు వదిలేయాలని డిమాండ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ అందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఒక సీటు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తున్నది. మీ పార్టీతో పొత్తు ఉండదని.. విలీనం చేయాలని ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం.

కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా చెప్పడంతో షర్మిల రాజకీయ భవిష్యత్‌పై పూర్తిగా తర్జనభర్జన పడుతున్నారు. రెండేళ్ల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఉన్న క్యాడర్ కూడా ఇప్పుడు లేదు. క్రమక్రమంగా పలువురు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. పాలేరు నుంచి తాను బరిలోకి దిగినా.. గెలుస్తాననే నమ్మకం లేదు. రెండేళ్లు తెలంగాణలో ఊరూరా తిరిగిన సమయంలో కాంగ్రెస్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రి వైఎస్ఆర్‌పై లేనిపోని కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే పార్టీతో జతకట్టడంపై విమర్శలు వస్తాయని షర్మిల భయపడుతున్నారు.

తెలంగాణలో ఎన్నికల బాధ్యతలు తీసుకుంటారని భావిస్తున్న డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ అనంతరం.. ఆయన హైకమాండ్‌కు ఒక నివేదిక ఇచ్చారు. పొత్తు కంటే విలీనమే బెటర్ అని ఆయన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం వైఎస్ఆర్టీపీని విలీనం చేసినా, పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్‌కు నష్టమనే నివేదిక పంపినట్లు తెలుస్తున్నది. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి, తెలంగాణపై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ఆర్ కూతురుని పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఆయన హైకమాండ్‌కు చెప్పినట్లు సమాచారం. అంతే కాకుండా అధికార బీఆర్ఎస్ కూడా ఇదే విషయాన్ని ప్రజల ముందు పెట్టే అవకాశం ఉందని.. కాబట్టి షర్మిల పార్టీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని కోరినట్లు తెలుస్తున్నది.

కాగా, ప్రస్తుతం రెండు నివేదికలు పార్టీ హైకమాండ్ వద్ద ఉన్నాయి. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. అవసరం అయితే.. షర్మిలను ఏపీ రాజకీయాల కోసం వాడుకునే అంశాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

First Published:  19 Jun 2023 8:07 AM IST
Next Story