Telugu Global
Telangana

మునుగోడుకు ఉపఎన్నిక వస్తే కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సహకరిస్తారా? సందిగ్ధంలో కాంగ్రెస్ నాయకత్వం.!

తమ్ముడు అభ్యర్థి అయినా.. బీజేపీ గెలిచేందుకు వెంకట్‌రెడ్డి సహకారం ఉండదని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. ఉప ఎన్నిక సమయంలో వెంకట్‌రెడ్డి తటస్థంగా ఉండటం కూడా కాంగ్రెస్‌కు మైనస్ అవుతుందని భయపడుతోంది.

మునుగోడుకు ఉపఎన్నిక వస్తే కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సహకరిస్తారా? సందిగ్ధంలో కాంగ్రెస్ నాయకత్వం.!
X

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం అంతా మునుగోడు నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి మునుగోడు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ను వెళ్లమని చెప్పలేక, ఉండమని బతిమిలాడ లేని సందిగ్ధ‌ పరిస్థితిలో ఉంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి రోజుకో లీక్ ఇస్తూ అసలు ఎప్పుడు పార్టీని వీడతారో స్పష్టంగా చెప్పట్లేదు. బీజేపీలో చేరితే కచ్చితంగా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను ఎదుర్కోవాలని షరతు పెట్టింది. దీంతో రాజగోపాల్ రెడ్డి మీనమేషాలు లెక్కిస్తున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే కాకుండా పరువు కూడా పోగొట్టుకుంది. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే మాత్రం కచ్చితంగా గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ నాయకులతో టచ్‌లో ఉన్నారు. ఉపఎన్నిక వస్తే ఎలా ముందుకు పోవాలనే విషయాలను ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా ఉపఎన్నిక అనివార్యం అయితే తిరిగి దాన్ని ఎలా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలనే వ్యూహ రచన చేస్తున్నారు.

ఇక ఉపఎన్నికకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారం ఎలా ఉంటుందనే విషయంపైనే కాంగ్రెస్‌లో చర్చ జరుగుతుంది. తమ్ముడికి సహకరిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ గెలుపున‌కు కృషి చేస్తారా అనే డైలమా కొనసాగుతోంది. సొంత తమ్ముడికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో పర్యటించే అవకాశం అయితే ఉండదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అదే సమయంలో తమ్ముడు అభ్యర్థి అయినా.. బీజేపీ గెలిచేందుకు వెంకట్‌రెడ్డి సహకారం ఉండదని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. ఉప ఎన్నిక సమయంలో వెంకట్‌రెడ్డి తటస్థంగా ఉండటం కూడా కాంగ్రెస్‌కు మైనస్ అవుతుందని భయపడుతోంది.

దీంతో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే.. వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా విమర్శలు చేయించేలా అన్న వెంకట్‌రెడ్డిని సిద్ధం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అందుకు వెంకట్‌రెడ్డి ఎలాంటి సమాధానం చెప్పలేదని సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ అధిష్టానంతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగే ఈ సమావేశానికి వెంకట్‌రెడ్డి హాజరవుతానని చెప్పినట్లు తెలుస్తుంది.

ఈ భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మునుగోడుపై రూటు మార్చనుందని, ఇక రాజగోపాల్ రెడ్డి-బీజేపీ లక్ష్యంగా ప్రెస్ మీట్లు పెట్టబోతున్నట్లు సమాచారం. ఆయన రాజీనామా చేసిన వెంటనే మునుగోడుకు అభ్యర్థిని ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ అభ్యర్థిని సపోర్ట్ చేస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ప్రకటన చేయించాలని భావిస్తోంది. అలా చేయడం వల్ల కోమటిరెడ్డి అనుచరుల సందిగ్ధానికి తెరపడుతుందని.. ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తారని పార్టీ అంచనా వేస్తోంది. మరి ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఇంకా ఏయే వ్యూహాలు రచిస్తుందో వేచి చూడాలి.

First Published:  1 Aug 2022 5:45 PM IST
Next Story