Telugu Global
Telangana

ప్లీజ్ ప్లీజ్ నామినేష‌న్లు విత్‌డ్రా చేసుకోరూ.. రెబల్స్‌ను బుజ్జ‌గిస్తున్న కాంగ్రెస్

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే హైద‌రాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ బుజ్జ‌గింపుల కార్య‌క్రమాన్ని ముమ్మ‌రం చేశారు.

ప్లీజ్ ప్లీజ్ నామినేష‌న్లు విత్‌డ్రా చేసుకోరూ.. రెబల్స్‌ను బుజ్జ‌గిస్తున్న కాంగ్రెస్
X

తెలంగాణ‌లో నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసింది. స్క్రూటినీ కూడా అయిపోయింది. ఇక మిగిలింది ఉప‌సంహ‌ర‌ణే. ఈ రోజే దానికి చివ‌రి రోజు. అందుకే పార్టీ టికెట్ ద‌క్క‌క రెబ‌ల్స్‌గా బ‌రిలోకి దిగిన నేత‌ల‌ను ఎలాగైనా ఒప్పించి విత్‌డ్రా చేయించేందుకు కాంగ్రెస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే హైద‌రాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ బుజ్జ‌గింపుల కార్య‌క్రమాన్ని ముమ్మ‌రం చేశారు. ఇండిపెండెంట్లుగా, ఇత‌ర చిన్న పార్టీల త‌ర‌ఫున నామినేష‌న్స్ వేసిన‌వారిని బ‌తిమాలుతున్నారు.

ఒకరూ, ఇద్ద‌రు కాదు.. చాలామందే ఉన్నారు.

సూర్యాపేటలో టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ పటేల్ ర‌మేష్‌ రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేశారు. ఆయ‌న బ‌రిలో ఉంటే దామోదర్‌రెడ్డి చిక్కుల్లో ప‌డ‌తార‌ని గుర్తించిన కాంగ్రెస్ బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. వరంగల్ వెస్ట్ టికెట్‌ను కాంగ్రెస్ నాయిని రాజేందర్ రెడ్డికి కేటాయించింది. ఇక్కడి నుంచి బ‌రిలోకి దిగిన జంగా రాఘవరెడ్డితో పార్టీ నేత‌లు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

ఇబ్రహీంపట్నంలో రెబల్‌గా బరిలో నిలిచిన దండెం రాంరెడ్డి, వైరా నుంచి నామినేషన్ వేసిన విజయభాయ్, నర్సాపూర్ నుంచి నిల‌బ‌డిన గాలి అనిల్ కుమార్, డోర్నకల్ నుంచి బరిలోకి దిగిన నెహ్రూ నాయ‌క్‌ల‌ను కూడా నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకోవాల‌ని అగ్ర‌నేత‌లు ప‌దేప‌దే విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. జుక్కల్ టికెట్ ద‌క్క‌క అసంతృప్తితో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన సౌదాగర్ గంగారాంను నామినేష‌న్ విత్ డ్రా చేసుకోవాల‌ని ఠాక్రే చర్చిస్తున్నారు.

బాన్సువాడ టికెట్ దక్కక ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసిన కాసుల బాలరాజు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. సిరిసిల్లలో ఉమేష్‌రావు రెబల్‌గా నిల‌బ‌డ్డారు. ఆదిలాబాద్‌లో సంజీవ‌రెడ్డి బరిలోకి దిగారు. వీరంద‌రితో విత్ డ్రా చేయించేందుకు కాంగ్రెస్ నేత‌లు నానా తంటాలు ప‌డుతున్నారు.

ఇక్క‌డ ఇద్ద‌రేసి రెబల్స్‌

బోథ్ నుంచి బరిలోకి అశోక్, నరేశ్ జాదవ్‌ల‌నూ నామినేష‌న్లు విత్‌డ్రా చేసుకోవాల‌ని బ‌తిమాలుతున్నారు. పాలకుర్తి టికెట్‌ను లక్ష్మణ్ నాయక్, సుధాకర్ గౌడ్ ఆశించ‌గా వారిద్ద‌రినీ కాద‌ని య‌శ‌స్వినికి టికెటిచ్చారు. దీంతో వాళ్లిద్ద‌రూ ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. దీంతో వారితోనూ ఠాక్రే, మహేశ్ కుమార్ గౌడ్ చర్చిస్తున్నారు. దాదాపు 10 స్థానాల్లో గ‌ట్టి నాయ‌కులే రెబెల్స్ మోగిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ వారిని బుజ్జ‌గించేందుకు కిందా మీదా అవుతోంది. ఇందులో ఎంత‌మంది ఉప‌సంహ‌రించుకుని పార్టీ అభ్య‌ర్థికి స‌హ‌క‌రిస్తారో చూడాలి మ‌రి.

First Published:  15 Nov 2023 8:24 AM IST
Next Story