గోడ దూకడంలోనూ ప్రోటోకాల్.. కడియం ఇంటికి కాంగ్రెస్ నేతలు
ఏఐసీసీ ఆదేశాలమేరకే పార్టీలోకి ఆహ్వానించేందుకు తాము కడియం ఇంటికి వచ్చినట్టు తెలిపారు దీపాదాస్ మున్షీ. కార్యకర్తలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో తన నిర్ణయం వెల్లడిస్తానని కడియం వారికి చెప్పినట్టు సమాచారం.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నారు, ఇంకా అధికారికంగా చేరలేదు. వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న తన కుమార్తెతో నిస్సహాయత లేఖ రాయించినప్పుడే కడియం వైఖరి అందరికీ అర్థమైంది. అయితే ఆ లేఖ తర్వాత ఆయన, ఆయన కుమార్తె నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. దానికి కూడా ఓ పద్ధతి, ప్రోటోకాల్ ఉందంటున్నారు కడియం శ్రీహరి. గోడదూకుడు వ్యవహారం కూడా పద్ధతిగానే చేస్తానంటున్నారాయన.
కడియం ఇంటికి కాంగ్రెస్ నేతలు..
తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరి, మల్లు రవి, సంపత్‌కుమార్, రోహిన్‌రెడ్డి తదితరులు కడియం నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్‌లోకి రావాలని వారు ఆయన్ను ఆహ్వానించారు. ఏఐసీసీ ఆదేశాలమేరకే పార్టీలోకి ఆహ్వానించేందుకు తాము కడియం ఇంటికి వచ్చినట్టు తెలిపారు దీపాదాస్ మున్షీ. కార్యకర్తలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో తన నిర్ణయం వెల్లడిస్తానని కడియం వారికి చెప్పినట్టు సమాచారం.
ఎందుకీ డ్రామాలు..?
కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటున్న కడియం మళ్లీ తన కార్యకర్తలతో చర్చించడమేంటి, ఒకటి రెండు రోజుల్లో తన నిర్ణయం వెల్లడించడమేంటి..? ఇదంతా పక్కా డ్రామాగా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. చర్చలన్నీ పూర్తైపోయి, వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసేందుకు డీల్ సెట్ అయిన తర్వాతే కడియం శ్రీహరి తన కుమార్తెతో కేసీఆర్ కి లేఖ రాయించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించినట్టు, ఆయన ఆలోచించుకుని చెబుతానన్నట్టుగా సీన్ క్రియేట్ చేశారు. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి జిమ్మిక్కుల్ని ఇప్పుడు కూడా పాటిస్తున్నారా అంటూ కడియంపై సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. చివరకు కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా కడియం ప్రకటించడం ఈ ఎపిసోడ్ కి క్లైమాక్స్ సీన్ అంటూ నెటిజన్లు ముందుగానే స్క్రీన్ ప్లే రాసేశారు.