Telugu Global
Telangana

ఖమ్మంలో మళ్లీ తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు

పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మళ్లీ తన్నుకున్నారు. కుర్చీలు విసిరేసుకుంటూ.. విరగ్గొడుతూ కార్యాలయంలో భీతావహ వాతావరణం సృష్టించారు.

ఖమ్మంలో మళ్లీ తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు
X

కాంగ్రెస్ పార్టీ నాయకులను మార్చడం అంత ఈజీ కాదు. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే నాయకులు.. ఆ స్వేచ్ఛను అపరిమితంగా వాడేస్తుంటారు. గ్రూపులు కట్టి బహిరంగంగానే ఘర్షణలకు దిగుతుంటారు. ప్రత్యర్థి పార్టీపై పోరాటం కన్నా.. సొంత పార్టీ నాయకులతో కుమ్ములాటలే ఈ కాంగ్రెస్‌లో ఎక్కువగా కనపడుతుంటాయి. ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఘర్షణ జరిగి ఒక రోజు కూడా కాకముందే.. మరోసారి కుమ్ములాట చోటు చేసుకున్నది.

జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మళ్లీ తన్నుకున్నారు. కుర్చీలు విసిరేసుకుంటూ.. విరగ్గొడుతూ కార్యాలయంలో భీతావహ వాతావరణం సృష్టించారు. గొడవ పెద్దగా అవుతుండటంతో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సహా కీలక నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. ఖమ్మం జిల్లాలోకు చెందిన పలువురు నాయకులు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. వీరికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం దగ్గర మొదలైన చర్చ.. చినికి చినికి పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలో పలు గ్రూపుల మధ్య ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల సమావేశం జరిగింది. అయితే అక్కడి నుంచి టికెట్లు ఆశిస్తున్న మట్టా దయానంద్, మానవతారాయ్ వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. టికెట్ కేటాయింపు విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాపోపవాదాలు జరిగాయి.

జిల్లాకు చెందిన ముఖ్య కాంగ్రెస్ నాయకులే వీరి వెనుక ఉండి గలాటాకు ప్రోత్సహించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మట్టా దయానంద్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఆయన మొదట్లో పొంగులేటితో ఉన్నా.. ఇప్పుడు భట్టి వర్గంలో చేరిపోయారు. మరోవైపు మానవతారాయ్ వెనుక పొంగులేటి ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. నిన్న కూడా ఇలాంటి ఘర్షణే చోటు చేసుకోవడంతో సమావేశం వాయిదా వేశారు. బుధవారం కూడా కాంగ్రెస్ నాయకుల ధోరణి మారలేదు. మళ్లీ ముఖ్య నాయకుల ముందే ఘర్షణకు దిగారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్తో కూస్తో బలంగా ఉందంటే అది ఖమ్మం జిల్లానే అని చెప్పవచ్చు. అందుకే టికెట్ల కోసం భారీ పోటీ నెలకొన్నది. అయితే ఇప్పుడు నాయకులు ఇలా బహిరంగంగానే తన్నుకుంటుంటే గెలిచే సీట్లు కూడా ఓడిపోతామని కార్యక్తర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కలిసి కట్టుగా పని చేస్తే మంచిదని.. లేకపోతే ప్రజలు కూడా ఛీదరించుకుంటారని అంటున్నారు.

First Published:  13 Sept 2023 5:54 PM IST
Next Story