వెంకట రెడ్డీ... ఉంటే ఉండు, పోతే పో !
కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఢిల్లీలో అమిత్ షా తో సమావేశమవడం ఆ పార్టీ నాయకులను ఆగ్రహానికి గురి చేసింది. ఇవ్వాళ్ళ చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో ఆ పార్టీ నాయకులు వెంకట రెడ్డిపై నిప్పులు చెరిగారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, మునుగోడులో ఉపఎన్నికలు వచ్చే పరిస్థితి రావడంతో తెలంగాణలో రాజకీయవాతావరణం ఒక్కసారి వేడెక్కింది. బీజేపీలో చేరబోతున్న రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట రెడ్డి కూడా అదే పార్టీలో చేరతాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు వెంకట రెడ్డి అమిత్ షాను కలిశారు. ఇది కాంగ్రెస్ వర్గాల్లో ఆగ్రహావేశాలను కలిగిస్తోంది. ఈ రోజు చండూరులో జరిగిన బహిరంగ సభలో అవి బైటపడ్డాయి.
పీసీఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తో సహా అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్న ఈ సభలో సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ లు కోమటి రెడ్డి వెంకట రెడ్డిపై విరుచుకపడ్డారు. మిగతా నేతలంతా రాజగోపాల్ రెడ్డిపై విమర్షలకే పరిమితమైతే వీళ్ళిద్దరు మాత్రం సోదరులిద్దరిపై ఆగ్రహం వెళ్ళ గక్కారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరికి ఎన్నో పదవులిచ్చింది. అండగా నిలబడింది. కానీ వాళ్ళు కాంగ్రెస్ ను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని వారు ఆరోపించారు. స్వంత కాంట్రాక్టుల కోసం, స్వలాభం కోసం కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారని విమర్షలు గుప్పించారు. ఓ సమయంలో ఆవేశం ఆపుకోలేని అద్దంకి దయాకర్... ''నీ నియోజక వర్గంలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా ల దగ్గర మోకరిల్లుతున్న వెంకట రెడ్డీ... ఉంటే ఉండూ పోతే పో'' అని అనడమే కాక ప్రజలతో కూడా అదే మాట అనిపించారు.
ఇక రాంరెడ్డి దామోదర్ రెడ్డి కూడా వెంకట రెడ్డి , రాజగోపాల్ రెడ్డి లపై విమర్షలు గుప్పించారు. వాళ్ళు పార్టీకి చేసిన దానికన్నా వాళ్ళకోసం పార్టీ చేసిందే ఎక్కువన్నారాయన
''ఎన్నో పదవులిచ్చి గౌరవమిచ్చిన కాంగ్రెస్ పార్టీని కోమటి రెడ్డి బ్రదర్స్ మోసం చేశారు. ఇవ్వాళ్ళ వెంకట రెడ్డి అమిత్ షా దగ్గర ఎందుకు కూర్చున్నాడో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు పోతే కాంగ్రెస్ పార్టీ పోదు'' అని దామోదర్ రెడ్డి మండిపడ్డారు.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కోమటి రెడ్డి బ్రదర్స్ వ్యవహారం చిచ్చుకు కారణమవుతోంది. ఎవరెన్ని మాటలన్నా తాను కాంగ్రెస్ పార్టీని వీడేదే లేదని ఒకవైపు చెప్తూ మరో వైపు బీజేపీ నాయకులతో సమావేశమవుతున్న వెంకటరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ నాయకుల ఆగ్రహానికి కారణమవుతోంది. రాజగోపాల్ రెడ్డి నిన్నటి వరకు కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరించాడని విమర్షిస్తున్న కాంగ్రెస్ నేతలు వెంకటరెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నట్టు అనుమానిస్తున్నారు.