Telugu Global
Telangana

చంద్రబాబు మళ్లీ వస్తే పోరాటమే.. టీ.కాంగ్రెస్ నేతల వార్నింగ్

ప్రస్తుతం రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్న విజయశాంతి సైతం తెలంగాణలోకి టీడీపీ రీ-ఎంట్రీ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

చంద్రబాబు మళ్లీ వస్తే పోరాటమే.. టీ.కాంగ్రెస్ నేతల వార్నింగ్
X

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్ నిర్మిస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలతో మళ్లీ ఆందోళన మొదలైంది. నిజానికి తెలంగాణలో టీడీపీని స్వాగతించేందుకు ప్రజలు సుముఖంగా లేరు. ఓ రకంగా చంద్రబాబు పాలనలో జరిగిన విధ్వంసంతోనే తెలంగాణలో మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. తాజాగా తెలంగాణలో టీడీపీని విస్తరిస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు జగ్గారెడ్డి, విజయశాంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్ నిర్మిస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ కుట్రలు ఉన్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఏపీలో జనసేన, బీజేపీలతో ఆడిన పొలిటికల్‌ గేమ్‌ను తెలంగాణలోనూ బీజేపీ ఆడాలనుకుంటోందన్నారు. బీజేపీ చేతిలో చంద్రబాబు పావుగా మారారని ఆరోపించారు జగ్గారెడ్డి. అందుకే తెలంగాణకు చంద్రబాబు రాకను కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్వాగతించారని చెప్పుకొచ్చారు.



ఇక ప్రస్తుతం రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్న విజయశాంతి సైతం తెలంగాణలోకి టీడీపీ రీ-ఎంట్రీ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌ పర్యటన వెనుక రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు విజయశాంతి. చంద్రబాబు పర్యటన వెనుక రహస్య ఎజెండా ఉందన్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదన్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అంతేకాదు..తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలడం ఖాయమంటూ వార్నింగ్ ఇచ్చారు విజయశాంతి.

First Published:  9 July 2024 9:04 AM IST
Next Story