Telugu Global
Telangana

కేటీఆర్‌ కారుపై కాంగ్రెస్‌ లీడర్ల దాడి

మూసీ బాధితులతో మాట్లాడేందుకు వెళ్తుండగా అడ్డుకునే యత్నం

కేటీఆర్‌ కారుపై కాంగ్రెస్‌ లీడర్ల దాడి
X

మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తోన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కారుపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారు. అంబర్‌పేట్‌ నియోజకవర్గం గోల్నాక ప్రాంతంలోని మూసీ బాధితులను పరామర్శించేందుకు పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్‌ మంగళవారం వెళ్తుండగా కాంగ్రెస్‌ నాయకులు ఒక్కసారిగా ఆయన కారుపై దాడికి తెగబడ్డారు. వారిని బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు కేటీఆర్‌ కారుపైకి ఎక్కి అద్దాలు పగుల గొట్టే ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను వారిని అడ్డుకుని అక్కడి నుంచి తరిమివేశారు. ఆ తర్వాత కేటీఆర్‌ గోల్నాక డివిజన్‌ లోని తులసీరామ్‌ నగర్‌ లో మూసీ బాధితులను పరామర్శించారు.

మీ తాటాకు చప్పుళ్లకు భయపడ.. మీ తాట తియ్యడానికే వచ్చా

దాడి అనంతరం తులసీరామ్‌ నగర్‌ లో కేటీఆర్‌ మాట్లాడుతూ, మీ తాటాకు చప్పుళ్లకు భయపడబోనని.. మీ తాట తియ్యడానికే వచ్చానని హెచ్చరించారు. ప్రజలకు అడంగా నిలబడడానికి వచ్చిన తనను ఆపలేవని సీఎం రేవంత్‌ రెడ్డికి తేల్చిచెప్పారు. ''నీ పిల్లి కూతలకి భయపడేవాళ్లు ఎవ్వరూ లేరిక్కడ.. ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో.. బడుగు బలహీనుల గొంతులను నీ బుల్డోజర్లు తొక్కిపెట్టలేవు.. నీ గుండ రాజ్యాన్ని.. నియంతృత్వ పాలనను సవాల్‌ చేసే నా స్ఫూర్తిని నీ గుండాలు ఆపలేరు.. నీ గుండాలు నా వాహనంపై చేసిన దాడి నాకు మరింత శక్తిని ఇస్తుంది.. ఇట్లాంటివి మమ్మల్ని ఆపలేవు'' అని తేల్చి చెప్పారు.

రాహుల్‌ జీ.. మొహబ్బత్‌ కీ దుకాన్‌ ఇదేనా : హరీశ్‌ రావు

రాహుల్‌ జీ.. నఫ్రత్‌ కే బజార్‌ మే మొహబ్బత్‌ కీ దుకాన్‌ అంటే ఇదేనా అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. కేటీఆర్‌ కారుపై కాంగ్రెస్‌ నేతల దాడిని 'ఎక్స్‌' వేదికగా ఆయన ఖండించారు. దాడి ఘటనపై రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాలపై దాడి చేయడమేనా ప్రజా పాలన అంటే అని నిలదీశారు. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు, నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు.. ఇవేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటే.. కేటీఆర్‌ పై దాడికి తెగబడిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

First Published:  1 Oct 2024 3:23 PM IST
Next Story