Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నేతల సందడి.. అసలు కారణం ఏంటంటే..?

చోటామోటా నాయకులు, సీనియర్ లీడర్లు చాలామంది రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనను కలసి వెళ్తున్నారు. తమ ప్రాంతంలో జరిగిన ఓటింగ్ సరళిని వివరిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నేతల సందడి.. అసలు కారణం ఏంటంటే..?
X

ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఉత్సాహం కాంగ్రెస్ నేతల్లో స్పష్టంగా కనపడుతోంది. ఫలితాలు విడుదలయ్యేది ఆదివారమే అయినా సంబరాలు మాత్రం ముందుగానే మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద నాయకుల సందడి మొదలైంది. చోటామోటా నాయకులు, సీనియర్ లీడర్లు చాలామంది రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనను కలసి వెళ్తున్నారు. తమ ప్రాంతంలో జరిగిన ఓటింగ్ సరళిని వివరిస్తున్నారు. కాంగ్రెస్ విజయం ఖాయమంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ పై చర్చలు, సీట్ల అంచనాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకుంటున్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్‌ రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్‌, ఎ.చంద్రశేఖర్‌, మహేష్ కుమార్‌ గౌడ్‌, మల్లు రవి తదితరులు.. రేవంత్ రెడ్డిని కలిశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కాంగ్రెస్‌ కు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తుందనే ధీమాతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈ నెల 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని, అదే రోజు గ్యారంటీ హామీలపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలంటున్నాయి.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు బలంగా నడిచాయి. ఒకరిపై ఒకరు ఢిల్లీకి ఫిర్యాదులు మోసుకుపోయేవారు. ఆఖరికి పాదయాత్రల విషయంలో కూడా వారి మధ్య సమన్వయం లేదు. కానీ, అధిష్టానం సీరియస్ వార్నింగ్.. కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలపై బాగానే పనిచేసిందని చెప్పాలి. ఎన్నికలనాటికి అందరూ సైలెంట్ అయ్యారు. ఎవరిపనివారు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం కలియదిరిగారు. ఎగ్జిట్ పోల్స్ పాజిటివ్ గా ఉండటంతో కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారు. పార్టీలో ఎన్ని గ్రూపులున్నా.. ముందుగా పీసీసీ అధ్యక్షుడితో సఖ్యతగా ఉండటం మేలు అనేది కొంతమంది నాయకుల ఆలోచన. అందులోనూ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఆయనను కలిసేందుకు నేతలు ఉత్సాహం చూపిస్తున్నారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి.

*

First Published:  2 Dec 2023 8:06 AM IST
Next Story