Telugu Global
Telangana

బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ నేత‌ మర్రి శశిధర్ రెడ్డి?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. బీజేపీ నాయకురాలు డీకే అరుణతో కలిసి ఆయన ఈ రోజు ఢిల్లీ వెళ్ళారు.

బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ నేత‌ మర్రి శశిధర్ రెడ్డి?
X

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచీ ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్న సీనీయర్ కాంగ్రెస్ నాయకుడు శశిధర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పైగా రేవంత్ పై, తెలంగాణ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ పై బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు.

ఈ క్రమంలో అన్ని పార్టీల నాయకులను తమ పార్టీ లో చేర్చుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్న బీజేపీ శశిధర్ రెడ్డిని సంప్రదించినట్టు సమాచారం. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగి ప్రస్థుతం బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ శశిధర్ రెడ్డితో మంతనాలు సాగించి బీజేపీలో చేరడానికి ఒప్పించినట్టు తెలిసింది.

శశిధర్ రెడ్డి తో బీజేపీ ఢిల్లీ పెద్దల సమావేశంకోసం ఈ రోజు డీకే అరుణ శశిధర్ రెడ్డిని తీసుకొని ఢిల్లీ వెళ్ళినట్టు సమాచారం. ఈ రోజు లేదా రేపు శశిధర్ రెడ్డి, అమిత్ షాను, నడ్డాను కలిసే ఆవకాశం ఉంది. బీజేపీ అగ్రనేతలతో సమావేశం తరువాత శశిధర్ రెడ్డి ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ అధికారికంగా బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా తాను బీజేపీ చేరతాననే వార్తలను శశిధర్ రెడ్డి ఖండించారు. మనవడి స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు.బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన వెంట ఉన్నారన్న వార్తలపైనా ఆయనస్పందిస్తూ తాను వచ్చిన విమానంలో ఆమె ఒక్కరే కాదు అన్ని పార్టీల నాయకులు ఉన్నారని చెప్పారు. బీజేపీలో చేరేందుకే ఢిల్లీకి వచ్చానంటూ పుకార్లు పుట్టించడం సరికాదని శశిధర్ రెడ్డి అన్నారు.

First Published:  16 Nov 2022 4:44 PM IST
Next Story