Telugu Global
Telangana

కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారా..?

సహజంగానే మీడియా సెన్సేషన్​ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారు. ఇక రేవంత్​ వర్గీయులు కోమటిరెడ్డి విషయంలో ఏ తప్పు చేస్తాడా..? అని కాచుకొని ఉంటారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారా..?
X

బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అందరూ కష్టపడ్డా కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 సీట్లు రావని ఆయన అన్నట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో సొంత పార్టీ నేతలు కూడా కోమటిరెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఓ వైపు హాత్​ సే హాత్​ జోడో యాత్ర అంటూ మేం ఊరూరా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటే కోమటిరెడ్డి ఇలా మాట్లాడటం ఏమిటని వారు ఫైర్ అవుతున్నారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్​ చేస్తున్నారు.

నిజానికి కోమటిరెడ్డి ఏమన్నారంటే.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం రాదు.. హంగ్​ వచ్చే చాన్స్​ ఉంది.. ఏవైనా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యులర్​ పార్టీలు కాబట్టి.. ఈ రెండు పార్టీలు కలిసి అధికారం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో తాము ఎప్పటికీ కలిసి అధికారం పంచుకోలేము కాబట్టి.. బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాల్సి వస్తుందేమో అని ఆయన అభిప్రాయపడ్డారు.

సహజంగానే మీడియా సెన్సేషన్​ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారు. ఇక రేవంత్​ వర్గీయులు కోమటిరెడ్డి విషయంలో ఏ తప్పు చేస్తాడా..? అని కాచుకొని ఉంటారు. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగి కోమటిరెడ్డిపై ఇప్పటికైనా అధిష్టానం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్​ చేయడం గమనార్హం.

రేవంత్​ పీసీసీ అధ్యక్షుడయ్యాక .. కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. పీసీసీ పదవిని ఆశించి.. రేసులో చివరిదాక నిలిచిన కోమటిరెడ్డి కూడా ఆ అసంతృప్తితోనే ఉన్నారు.

ఇదిలా ఉంటే అంతర్గతంగా మాట్లాడాల్సిన మాటలను ఆయన మీడియా ముందు మాట్లాడటంతో రచ్చ రచ్చ అయ్యింది. బీఆర్ఎస్​ ను ఓడించేందుకు మేమంతా కంకణం కట్టుకుంటే.. కోమటిరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని ఆయన శత్రువులకు కూడా అవకాశం దొరికింది. మరి కోమటిరెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్​ హైకమాండ్​ అర్థం చేసుకుంటుందా..? లేక చర్యలు తీసుకుంటుందా..? అన్నది వేచి చూడాలి.

First Published:  14 Feb 2023 6:13 PM IST
Next Story