నేను అలసిపోయా.. నన్ను ఆయాసపెట్టకండి..
మునుగోడు నియోజకవర్గంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ తాను ఎంతో శ్రమపడ్డానని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేశానని, అలసిపోయానని, ఇంకా తనను ఆయాస పెట్టొద్దని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రచారానికి రాలేదని అనుకోవద్దని, పూర్తి స్థాయిలో తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండలేకపోవచ్చని చెప్పారు.
ఆ పరిస్థితి వస్తే అప్పుడొస్తా..
మీరు పూర్తిగా అలసిపోయి, కాడె కిందపడేసినప్పుడు తాను ఎంట్రీ ఇస్తానని చెప్పారు జానారెడ్డి. అయితే ఇక్కడ అలసిపోయేది ఎవరు, కాడె కిందపడేసేది ఎవరనేదానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పార్టీలో మరో చర్చ మొదలైంది. జానారెడ్డి నిజంగానే అలసిపోయి ఆ మాట చెబుతున్నారా, లేక ఎవరినైనా టార్గెట్ చేశారా అనేది తేలాల్సి ఉంది.
మునుగోడు కాంగ్రెస్‌దే..
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగునీరు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు జానారెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రూపుమాపడానికి కాంగ్రెస్ చేసిన కృషి అందరికీ తెలుసని అన్నారాయన. అందుకే జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ని గుర్తుంచుకుంటారని, మునుగోడులో విజయం తమదేనని అన్నారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. ఆ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కాంగ్రెస్‌తో మాత్రమే సాధ్యమన్నారు.