వెంకట్ రెడ్డి నోటీసులు.. జైరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పటికే నల్గొండను టీఆర్ఎస్ చుట్టు ముట్టేసింది. వెంకట్ రెడ్డి కూడా తమ్ముడి బాటలో బీజేపీలోకి వెళ్లినా పెద్దగా సాధించేదేమీ ఉండదు. సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకుని నమ్మకుని పార్టీలో కొనసాగడమే ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం.
కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం. అయితే ఆ నోటీసులకు ఆయన సమాధానం ఇచ్చారా లేదా అనేదానిపై అధికారికంగా క్లారిటీ లేదు. సమాధానం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ఓ మెట్టు దిగి రెండోసారి ఆయనకు నోటీసులిచ్చిందనే ప్రచారం జరిగింది. లేదు లేదు ఆయన సీల్డ్ కవర్ లో ఆల్రడీ సమాధానం ఇచ్చేశారనే వార్త కూడా తెరపైకి వచ్చింది. అసలు ఈ రెండిటిలో ఏది నిజమో తేలకముందే తెలంగాణలో జోడో యాత్రలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో లక్ష్మణరేఖ ఎవరు దాటినా చర్యలు తప్పవని అంటున్న జైరాం రమేష్, ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశామని, సమాధానం రాకపోతే చర్యలుంటాయని చెప్పారు. అంటే వెంకట్ రెడ్డి ఇంకా సమాధానం ఇవ్వలేదని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. మరి సమయం మించిపోయినా సమాధాం ఇవ్వకపోతే చర్యలు ఎందుకు తీసుకోలేదో కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది.
ఒకరికొకరు అవసరం..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉన్నా ఒక్కొక్కరే పార్టీని వీడటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నవారిపై వేటు వేస్తే ఆ నష్టం మరింత ఎక్కువ అవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అలాగని పార్టీ ఓడిపోతుందంటూ స్టేట్ మెంట్లు ఇచ్చి, పరోక్షంగా పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమైన వెంకట్ రెడ్డి లాంటి వారిని ఉపేక్షిస్తారని అనుకోలేం. అదే సమయంలో వెంకట్ రెడ్డికి కూడా కాంగ్రెస్ అవసరం చాలా ఉంది. ఇప్పటికే నల్గొండను టీఆర్ఎస్ చుట్టు ముట్టేసింది. వెంకట్ రెడ్డి కూడా తమ్ముడి బాటలో బీజేపీలోకి వెళ్లినా పెద్దగా సాధించేదేమీ ఉండదు. సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకుని నమ్మకుని పార్టీలో కొనసాగడమే ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం. అందుకే ఆయన కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. అటు అధిష్టానం కూడా తెగేదాకా లాగకుండా నోటీసులతో సరిపెట్టింది. కానీ పైకి మాత్రం లక్ష్మణరేఖ, క్రమశిక్షణ చర్యలంటూ చెబుతున్నారు నేతలు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత అటు కాంగ్రెస్ కానీ, ఇటు వెంకట్ రెడ్డి కానీ ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేయాలనుకోవడంలేదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.