Telugu Global
Telangana

మునుగోడు అభ్యర్థి కోసం కాంగ్రెస్ ఇంటర్వ్యూలు..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొని టికెట్ ఆశిస్తున్నవారితో మాట్లాడారు. వారి బలాబలాలు అడిగి తెలుసుకున్నారు.

మునుగోడు అభ్యర్థి కోసం కాంగ్రెస్ ఇంటర్వ్యూలు..
X

మునుగోడు అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది. ఆశావహులకు గాంధీ భవన్లో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసింది. ఆశావహులందర్నీ పిలిపించి వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొని టికెట్ ఆశిస్తున్నవారితో మాట్లాడారు. వారి బలాబలాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే రాష్ట్ర పార్టీ ఓ అంచనాకు వచ్చినా, వారి బలం, బహీనతలను వారి ముందే చర్చించేందుకు గాంధీ భవన్‌కి పిలిపించారు నేతలు.

ఆ నలుగురిలో ఒకరు..

పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్‌... ఈ నలుగురు తుది జాబితాలో కనిపిస్తున్నారు. పాల్వాయి స్రవంతి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 16 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. కృష్ణారెడ్డి, రవికుమార్ కూడా తమకు టికెట్ ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తామంటున్నారు. వీరందరి వద్ద సమాచారం సేకరించి ఆ తర్వాత హైదర్‌గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ కి వెళ్లారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. అక్కడ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌తో భేటీ అయ్యారు. టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థుల వివరాలు తెలియజేశారు. ఈ లిస్ట్ ని ఏఐసీసీకి నివేదించబోతున్నారు. ఏఐసీసీ ఆమోదించినవారిని మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ ప్రకటిస్తుంది.

మునుగోడుకి ఐదు దఫాలు కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తర్వాత ఆ సీటు కోసం 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు పాల్వాయి స్రవంతి. ఇప్పుడు అవకాశం వస్తే సత్తా చూపిస్తానంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందనే అనుమానాలున్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడంతోపాటు, అటు అధికార టీఆర్ఎస్‌ని కూడా బలంగా ఢీకొనే అభ్యర్థి కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. అంతిమంగా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు నిలిపే అభ్యర్థి ఎవరనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

First Published:  25 Aug 2022 4:25 PM IST
Next Story