Telugu Global
Telangana

ఖమ్మంలో టీడీపీని ఖాళీ చేసే పనిలో కాంగ్రెస్.. బాబుకు ఝలక్ ఇవ్వనున్న తమ్ముళ్లు!

ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టుల మధ్యే పోటీ నెలకొని ఉన్నది. కమ్యూనిస్టులు ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చారు.

ఖమ్మంలో టీడీపీని ఖాళీ చేసే పనిలో కాంగ్రెస్.. బాబుకు ఝలక్ ఇవ్వనున్న తమ్ముళ్లు!
X

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇప్పుడు ఉనికే లేకుండా పోయింది. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ.. తెలంగాణలో మాత్రం అనామక పార్టీగా మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీడీపీలో ఉన్న నాయకులు చాలా వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ బాట పట్టారు. సమైక్యాంధ్ర పార్టీగా ముద్ర పడిన టీడీపీలో ఉండేందుకు చాలా మంది ఇష్టపడలేదు. అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాస్త ప్రభావం చూపగలిగింది. ఇప్పటికీ టీడీపీ ఆ జిల్లాలో కాస్త ప్రభావం చూపిస్తోంది.

ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టుల మధ్యే పోటీ నెలకొని ఉన్నది. కమ్యూనిస్టులు ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చారు. అయితే, ఇటీవల ఆ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ పట్టును కోల్పోకుండా కాపాడుకుంటూ వచ్చింది. మల్లు భట్టి విక్రమార్క మొదటి నుంచి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. రేణుక చౌదరి వంటి ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఉన్నా.. ఆమె ఓడిపోయిన తర్వాత జిల్లా కాంగ్రెస్‌ను పట్టించుకోవడం మానేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆమె తిరిగి జిల్లా రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉన్నది. ఉమ్మడి ఖమ్మంలో ప్రభావితం చూపగలిగే కమ్యూనిస్టులు బీఆర్ఎస్ వైపు వెళ్లపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయాల వైపు దృష్టి పెట్టింది. ఇప్పటికీ జిల్లాలో ఓటు బ్యాంకు కలిగి ఉన్న టీడీపీని తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లాలో కీలక టీడీపీ నాయకులను కాంగ్రెస్‌లో చేర్పించేందుకు ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న తాళ్లూరి జీవన్ కుమార్‌తో పాటు మరి కొందరు నాయకులను కాంగ్రెస్‌లోకి రప్పించడానికి చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల టీమ్‌లో సభ్యుడిగా ఉన్న పొంగులేటి.. ఈ ప్రయత్నాలను భుజాన వేసుకున్నారు. కీలకమైన టీడీపీ నాయకులందరినీ కాంగ్రెస్‌లోకి లాగేయడం ద్వారా ఓటు బ్యాంకు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల చంద్రబాబు నాయుడు ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి.. తెలంగాణలో టీడీపీ ఇంకా బతికే ఉన్నదని ప్రచారం చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తాము కూడా కీలక పాత్ర పోషిస్తామంటూ బాబు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అదే జిల్లాకు చెందిన కీలక నాయకులు బాబుకు ఝలక్ ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే చాలా మంది టీడీపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరగుతోంది. అదే జరిగితే తెలంగాణలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

First Published:  22 July 2023 12:11 PM IST
Next Story