Telugu Global
Telangana

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటతోనే స్రవంతి ఎంపిక.! మరి ప్రచారానికి ఎప్పుడొస్తారో?

అన్న సపోర్ట్ నాకే ఉంటుందని రాజగోపాల్ రెడ్డి మాత్రం బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న వెంకటరెడ్డి.. బీజేపీలో ఉన్న తమ్ముడి కోసం ప్రచారం చేస్తారా?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటతోనే స్రవంతి ఎంపిక.! మరి ప్రచారానికి ఎప్పుడొస్తారో?
X

మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిలా తయారైంది. ఒక కుటుంబం కారణంగా తామంతా బలి కావల్సి వస్తోందని కాంగ్రెస్ నాయకులే చర్చించుకుంటున్నారు. తమ్ముడి వల్ల ఉపఎన్నిక వస్తే.. అన్న మాత్రం పార్టీని ఏ మాత్రం పట్టించుకోకుండా తెర వెనుక మంతనాలు సాగిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడుకు నవంబర్ 3న పోలింగ్ జరుగనున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. 2018లో కోల్పోయిన సీటును గెలవాలనే పట్టుదలతో ఉన్నది. ఇక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా నియోజకవర్గంలో అందరికీ టచ్‌లో ఉంటూ ప్రచారాన్ని వేగవంతం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ మీడియాలో కూడా ఉండేలా చూసుకుంటున్నారు.

కానీ, సిట్టింగ్ సీటును కాపాడుకోవల్సిన కాంగ్రెస్ మాత్రం ఇంకా ప్రచారాన్ని ముమ్మరం చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నియోజకవర్గంలో కలియదిరుగుతున్నారు. ఆమెకు తోడుగా సీనియర్ నాయకులు ఎవరూ రావడం లేదు. ఎవరు వెంట రాకున్నా.. తాను మాత్రం గెలుపు కోసం పోరాడతానని స్రవంతి స్పష్టం చేస్తున్నారు. కాగా, అందరి చూపు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైనే ఉన్నది. మునుగోడు విషయంలో అసలు ఆయన వైఖరి ఏమిటో ఇంత వరకు స్పష్టం చేయలేదు. ఒక వైపు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం అన్న సపోర్ట్ నాకే ఉంటుందని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరి కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న వెంకటరెడ్డి.. బీజేపీలో ఉన్న తమ్ముడి కోసం ప్రచారం చేస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఎంపికకు కోమటిరెడ్డి వెంకటరెడ్డే కారణం అని తెలుస్తోంది. మొదటి నుంచి చలిమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, కైలాశ్ నేత పేర్లు వినిపించాయి. పాల్వాయి స్రవంతిని కూడా టీపీసీసీ సీనియర్లు ఇంటర్వ్యూ చేసినా.. తొలి రౌండ్‌లోనే పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డితో ఆమెకు ఉన్న విభేదాల కారణంగానే స్రవంతి అభ్యర్థిత్వంపై టీపీసీసీ చీఫ్ ఆసక్తి చూపడం లేదనే వార్తలు వచ్చాయి. తీరా చూస్తే ఏఐసీసీ మాత్రం స్రవంతినే అభ్యర్థిగా ప్రకటించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమె అయితేనే ప్రచారానికి వస్తానని చెప్పడంతోనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ స్రవంతి పేరు ప్రకటించి నాలుగు వారాలు అవుతోంది. మధ్యలో స్రవంతి స్వయంగా వెళ్లి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వచ్చారు. అయినా, ఇంత వరకు వెంకటరెడ్డి మునుగోడు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

టీపీసీసీ చీఫ్ రేవంత్, మల్లు భట్టి విక్రమార్క వంటి సీనియర్లు భారత్ జోడో యాత్ర ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇలాంటి సమయంలో స్టార్ క్యాంపెయినర్ వెంకటరెడ్డి బరిలోకి దిగితే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది. కానీ, పాల్వాయి స్రవంతి ఒక్కరే తన అనుచరులతో గ్రామాల్లో తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వం స్రవంతిని ఒంటరిని చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి తాను ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినా.. ఇంత వరకు కాలు బైట పెట్టలేదు. కాగా, రెండు మూడు రోజుల్లో వెంకటరెడ్డి మునుగోడులో పర్యటించే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా మునుగోడులో క్యాంపు వేసి ప్రచారాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకవైపు బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకొని పోతుంటే.. కాంగ్రెస్ ఇంకా ఎప్పుడు ప్రచారానికి వెళ్లాలా అని సందిగ్దంలో ఉండటంతో కార్యకర్తల్లో అసహనం పెరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా మునుగోడులో అడుగుపెట్టకపోతే.. ఉన్న ఓటర్లు కూడా వేరే పార్టీకి మొగ్గు చూపుతారని హెచ్చరిస్తున్నారు.

First Published:  9 Oct 2022 7:18 AM IST
Next Story