BRS అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం.. 40 శాతం సీట్లు వాళ్లకే..!
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఏఐసీసీ నేతల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ఓ అడుగు ముందుండగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ 60 శాతానికి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే మిగిలిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అసంతృప్త నేతల రాకకోసం వేచి చూడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేని నియోజకవర్గాలపై కొందరు బీజేపీ నేతలు సైతం కన్నేసినట్లు సమాచారం.
స్క్రీనింగ్ కమిటీ ఫైనలైజ్ చేసిన అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపింది. ఇక పార్టీలో చేరికల విషయమై చేర్చించేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు టీపీసీసీతో టచ్‌లో ఉన్నారని.. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఏఐసీసీ నేతల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. తన కొడుకు రోహిత్‌కు టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మైనంపల్లికి.. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కుటుంబం.. ఒకే టికెట్ అన్న విధానానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన ఆశలు కాంగ్రెస్‌లోనూ నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు.
మైనంపల్లి అనుచరులు మాత్రం ఇద్దరికి టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందని ప్రచారం చేస్తున్నారు. ఇక శనివారం మీడియాతో మాట్లాడిన మైనంపల్లి తాను కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను మల్కాజ్‌గిరి నుంచి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 75 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
*