Telugu Global
Telangana

తొలి లిస్టు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్.. ఈ సారి వాళ్లకు టికెట్లు దక్కడం కష్టమే!

రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సెగ్మెంట్‌కు ముగ్గురి చొప్పున ఆశావాహుల లిస్టును తయారు చేసి అధిష్టానానికి పంపినట్లు తెలుస్తున్నది.

తొలి లిస్టు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్.. ఈ సారి వాళ్లకు టికెట్లు దక్కడం కష్టమే!
X

తెలంగాణ కాంగ్రెస్ అప్పుడే టికెట్ల కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో చేరికలు పెరగడంతో క్యాడర్ అంతా ఉత్సాహంగా ఉంది. ఈ క్రమంలో దాదాపు 70 అసెంబ్లీ సీట్లకు ముందస్తుగా టికెట్లు కన్ఫార్మ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. చివరి నిమిషంలో టికెట్లు కేటాయించడం ద్వారా అభ్యర్థుల మధ్య గందరగోళం ఏర్పడటమే కాకుండా.. ప్రచారం చేసుకోవడానికి కష్టం అవుతుంది. అందుకే ఎలాంటి సమస్య లేని నియోజకర్గాల్లో ముందుగానే అభ్యర్థులను నిర్ణయించనున్నట్లు టీపీసీసీ వర్గాలు చెప్పాయి.

రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సెగ్మెంట్‌కు ముగ్గురి చొప్పున ఆశావాహుల లిస్టును తయారు చేసి అధిష్టానానికి పంపినట్లు తెలుస్తున్నది. ముగ్గురు అభ్యర్థుల బలాబలాలను కూడా నివేదికలో పొందు పరిచింది. గత చరిత్ర, ఆర్థిక, అంగ బలాలను కూడా ప్రస్తావిస్తూ నివేదిక సిద్ధం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరిద్దరి పేర్లు మాత్రమే ఏఐసీసీకి చేరినట్లు తెలుస్తున్నది. దాదాపు 200 మంది అభ్యర్థుల లిస్టును ఏఐసీసీకి పంపారని.. ఇందులో నుంచి తొలి జాబితాను సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి రెండు, మూడు కంటే ఎక్కువ సార్లు ఓడిపోయిన అభ్యర్థులను టీపీసీసీ అసలు పరిశీలనకు కూడా తీసుకోలేదని తెలుస్తున్నది. వరుస ఓటములు ఎదుర్కున్న వారు.. చాలా కాలం నుంచి పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గంలో ప్రజలకు దూరంగా ఉన్న వారికి ఈ సారి టికెట్లు దక్కవని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. ఆయా నియోజకవర్గాల్లో యాక్టీవ్‌గా ఉన్న వారికి, యువతకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.

కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నెలకొన్నది. బలమైన బీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ వల్లనే సాధ్యం అవుతుందనే సందేశం ప్రజల్లోకి వెళ్లింది. బీజేపీ పార్టీవి అన్నీ ఉత్తమాటలే అని తెలుసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం చాలా మంది ఆశావాహులు రెడీ అయ్యారు. వీరందరినీ ఇప్పుడే జల్లెడ పట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే వరుస ఓటములు ఎదుర్కున్న వారికి టికెట్‌ను నిరాకరిస్తోంది. ఏఐసీసీకి పంపిన లిస్టును క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత.. కనీసం 50 నుంచి 60 స్థానాలకు జాబితా వెలువడే అవకాశం ఉందని.. వారి లిస్టును హైకమాండ్ ముందుగానే ప్రకటిస్తుందని సమాచారం.

First Published:  1 July 2023 5:20 PM IST
Next Story