Telugu Global
Telangana

మునుగోడులో మాకు కాంగ్రెస్‌తోనే పోటీ : మంత్రి జగదీశ్ రెడ్డి

కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అసలు ఎన్నికలో పోటీ చేసే అర్హతే లేదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

మునుగోడులో మాకు కాంగ్రెస్‌తోనే పోటీ : మంత్రి జగదీశ్ రెడ్డి
X

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమేనని.. బీజేపీతో గానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో గానీ ఎలాంటి పోటీ ఉండదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మునుగోడులో బీజేపీకి తగినంత బలం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ఉపఎన్నిక రావడానికి కారణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థమేనని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టుల ద్వారా భారీ స్థాయిలో లాభాలు పొందడానికే ఆయన కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని అన్నారు. ఇప్పుడు ఆ స్వార్థమే ఉపఎన్నిక తీసుకొని వచ్చిందని అన్నారు.

ఈ ఉపఎన్నిక ఓ ధర్మయుద్ధమని కోమటిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఈ యుద్ధంలో అంతిమంగా ధర్మమే గెలుస్తుందని జగదీశ్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇమేజ్‌ను అడ్డుకునే కుట్రలో భాగమే మునుగోడు ఉపఎన్నిక అన్నారు. దిగజారుడు రాజకీయాలతో బీజేపీలో చేరి, నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ కోమటిరెడ్డి ట్యాగ్‌లైన్ తగిలించుకున్నారని మంత్రి మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి అసలు ఎన్నికలో పోటీ చేసే అర్హతే లేదన్నారు. కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం కోవర్టుగా పని చేశారని దుయ్యబట్టారు.

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు భిగించాలని బీజేపీ భావిస్తోంది, ఇప్పుడు ప్రజలు కనుక ఆ పార్టీకి ఓటేస్తే మీటర్లు రావడం ఖాయమని మంత్రి తెలిపారు. విద్యుత్, వ్యవసాయ చట్టాలకు కూడా మనం ఆమోదం తెలిపినట్లు అవుతుందని హెచ్చరించారు. ఈ బాధల నుంచి బయటపడాలంటే టీఆర్ఎస్‌ను గెలిపించడం ఒక్కటే మార్గమన్నారు. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీలో ఆశావహులే తప్ప అసంతృప్తులు ఉండరని అన్నారు.

మునుగోడు ఉపఎన్నికతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపన్నారు. వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఒప్పందాల గురించి రాజగోపాల్ మాట్లాడిన మాటల ఆధారంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని.. ఆయన చర్యలను ప్రజలకు కూడా వివరిస్తామని జగదీశ్ రెడ్డి చెప్పారు. అన్ని రకాల ధరలు పెంచి సామాన్యుడిని ముప్పతిప్పలు పెడుతున్న బీజేపీకి ఓటర్లు దూరంగా ఉండాలని ఆయన కోరారు. మునుగోడు అభివృద్ధి చెందకపోవడానికి కారణం రాజగోపాల్ రెడ్డే అని ఆరోపించారు.

First Published:  9 Oct 2022 5:59 AM IST
Next Story