ఆత్మరక్షణలో కాంగ్రెస్.. కేసీఆర్ వ్యూహం ముంగిట విలవిల..!
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం ఎంత నిజమో.. అప్పటికీ 14 ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరుగని పోరాట యోధుడిగా సీఎం కేసీఆర్ నిలిచారన్నదీ అంతే నిజం..
పదేండ్ల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్.. ఉద్యమంతో సాధించిన పార్టీగా ఒకనాటి టీఆర్ఎస్.. ప్రస్తుత బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2018లో తొలుత అధికార టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యర్థిగా నిలిచిన కాంగ్రెస్.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వికటించి.. బంపర్ మెజారిటీతో గులాబీ పార్టీకి అధికారం వచ్చేలా చేసింది. తాజాగా ఈ నెల 30న పోలింగ్ జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్.. నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల మదిలో ఏమున్నదో వెలుగు చూడటం లేదు. తొమ్మిదిన్నరేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌పై ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఆశతో ఉంది కాంగ్రెస్.. దీనికి తోడు ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయ భేరీ మోగించిన ఉత్సాహంతో తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించారు కాంగ్రెస్ అధి నాయకురాలు సోనియాగాంధీ. ఈ గ్యారంటీలు తెలంగాణ సమాజం గుండెలను తాకాయి. అధికార బీఆర్ఎస్ `కాంగ్రెస్ అలవిగానీ హామీలు` ఇచ్చిందంటూ తొలుత తోసిపుచ్చినా.. తర్వాత కొద్దిపాటి సవరణలతో అవే హామీలను కూర్చి మేనిఫెస్టో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ హామీలతో బెంబేలెత్తిన బీఆర్ఎస్.. అదే హామీలు ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం తమ ఆరు గ్యారంటీలనే బీఆర్ఎస్ కాపీ కొట్టిందని తొలుత హోరెత్తించారు. ఎవరు అవునన్నా.. కాదన్నా కాంగ్రెస్ `ఆరు గ్యారంటీ`లు తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నాయన్నది నిష్ఠూర సత్యం. ఈ సంగతి గుర్తించిన గులాబీ బాస్‌లు క్రమంగా వ్యూహం మార్చారు. కర్ణాటకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ.. కరంట్ సరఫరా కావడం లేదంటూ బహిరంగసభల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిలతోపాటు పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
వాక్చాతుర్యంలో గండరగండడుగా పేరొందిన తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహ చాతుర్యం.. ముందు చూపును అర్థం చేసుకోవడంలో హస్తం పార్టీ నేతలు `తప్పులో కాలేశారు`అని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. యావత్ తెలంగాణ సమాజాన్ని ఆకర్షించేలా రూపొందించిన `ఆరు గ్యారంటీ`లపై ఎక్కువ దృష్టి పెట్టకుండా.. బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేయదని చెబుతున్నారు.
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం ఎంత నిజమో.. అప్పటికీ 14 ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరుగని పోరాట యోధుడిగా సీఎం కేసీఆర్ నిలిచారన్నదీ అంతే నిజం.. అయితే దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా పెరుగుతుంది అందులో ఎటువంటి అనుమానమూ లేదు.. కానీ, ఆ వ్యతిరేకత సాకుతో గులాబీ బాస్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం తటస్థులు స్వీకరించలేరని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
ఒకవేళ ఊహించని స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా.. తెలంగాణ ఉద్యమ సారథిగా కేసీఆర్ నాయకత్వాన్ని నేరుగా ప్రశ్నించే వారు తక్కువనే చెప్పాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధుల అవినీతిపై చర్చ లేవనెత్తవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ కుంగడం, మరో రిజర్వాయర్‌కు బుంగలు పడటం వంటి ఘటనలు ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమే. ఆ విషయాలపై దృష్టి పెట్టడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలన్న ఆత్రంలో కాంగ్రెస్ నేతలు ఒక సంగతి విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ సాగుతోంది. బలం లేకపోయినా కొన్ని చోట్ల లెఫ్ట్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మూకుమ్మడిగా ఒకే పార్టీకి పడితేనే గెలుపు సాధ్యం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల అధికార పక్షానికి లబ్ధి చేకూరుతుంది. ఉదాహరణకు కోరుట్లలో అర్వింద్.. కల్వకుర్తిలో ఆచారి, పాలేరులో తమ్మినేని వీరభద్రం వంటి వారు గట్టి పోటీ దారులే. ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుని.. పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు తటస్థ ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉండొచ్చు. అటువంటప్పుడు ఇతర అభ్యర్థులకు ఓటేయాలని నిర్ణయించుకుంటే.. ఆ అభ్యర్థులే గెలవొచ్చు.. లేదా భారీగా ఓటు చీలితే అధికార పార్టీ లాభ పడవచ్చు.
కనుక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తాము ఇచ్చిన హామీలపై ప్రజల్లో విశ్వాసం కలిగించడం మాని.. ప్రభుత్వ అధినేతకు, గులాబీ అధి నాయకత్వంపై విమర్శలతో తెలంగాణ సమాజాన్ని ఆకర్షించవచ్చునని భ్రమించడం ఘోరమైన తప్పిదమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు తామేం చేయబోతున్నారో చెప్పి, ప్రజల మనస్సు దోచుకోవడం విజ్ఞుల పని. అలా కాకుండా అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు ప్రతిగా.. ఒక్కోసారి అధికార పార్టీ నేతలపై తమ ఆక్రోశాన్నివెళ్లగక్కేందుకు విమర్శలు చేయడం వల్ల ఫలితం ఉండదు సరి కదా.. అధికారంలోకి వచ్చేస్తున్నామన్న ఆశలు అడియాసలు కావడమే కాదు.. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ కనుమరుగయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.