Telugu Global
Telangana

రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని ప్రతిపాదించిన రేవంత్ రెడ్డి.. తిరస్కరించిన కాంగ్రెస్ అధిష్టానం?

ఒకే కుటుంబంలో ఎవరికీ ఒకటి కంటే ఎక్కువ టికెట్లు ఇవ్వడం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. అలాగే రెండు చోట్ల నుంచి ఒకే అభ్యర్థి పోటీకి కూడా ఛాన్స్ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.

రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని ప్రతిపాదించిన రేవంత్ రెడ్డి.. తిరస్కరించిన కాంగ్రెస్ అధిష్టానం?
X

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డి భావించారు. ఈ మేరకు ఏయే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తున్నది. కానీ, రేవంత్ రెడ్డి ప్రతిపాదనను నిరాకరించింది. కాంగ్రెస్‌లో కుటుంబానికి ఒకే టికెట్ అనే నిబంధన అమలులో ఉందని.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప.. ఒకే కుటుంబంలో ఎవరికీ ఒకటి కంటే ఎక్కువ టికెట్లు ఇవ్వడం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. అలాగే రెండు చోట్ల నుంచి ఒకే అభ్యర్థి పోటీకి కూడా ఛాన్స్ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేసులో ఉండే అవకాశం ఉన్నది. అందుకే ముందస్తు జాగ్రత్తగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావించారు. కొడంగల్‌తో పాటు ఎల్బీనగర్ లేదా ఉప్పల్ నుంచి పోటీకి ప్రతిపాదించారు. కొడంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తనను టార్గెట్ చేసి ఓడిస్తుందేమో అనే భయంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

ఎల్బీనగర్ పరిధిలో నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు ఏపీకి చెందిన సెటిలర్స్ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నది. అందుకే ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఎల్బీనగర్ నుంచి బండారు లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్నారు. ఉప్పల్ కూడా తనకు కలసి వస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ త్రిముఖ పోరు తప్పకుండా తనకు కలసి వస్తుందని అంచనా వేసుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్లాన్స్‌ను ముందుగానే అధిష్టానం పక్కన పెట్టింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ కుటుంబానికి కూడా రెండో టికెట్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. కర్ణాటకలో కూడా సిద్దరామయ్య కూడా రెండు చోట్ల టికెట్లు అడిగినా.. నిరాకరించిన విషయాన్ని గుర్తు చేసినట్లు తెలుస్తున్నది. ఏ సెగ్మెంట్ నుంచి టికెట్ కావాలో ముందుగానే నిర్ణయించుకోవాలని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మాత్రం రెండు టికెట్లు వచ్చే అవకాశం ఉన్నది. మరే కుటుంబానికి కూడా రెండో టికెట్ ప్రసక్తే లేనట్లు తెలుస్తున్నది.

First Published:  28 July 2023 8:09 AM IST
Next Story