Telugu Global
Telangana

రేవంత్‌కు బ్రేకులు రెడీగా ఉన్నాయా?

సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిసైడ్ చేసినట్లు చెప్పారు. అలాగే వన్ మ్యాన్ షో నడవదన్నారు. ఏ నిర్ణయమైనా సమిష్టిగానే తీసుకుంటామని కేసీ స్పష్టంగా ప్రకటించారు.

రేవంత్‌కు బ్రేకులు రెడీగా ఉన్నాయా?
X

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి అప్పుడే అధిష్టానం స్పీడు బ్రేకులు రెడీ చేసిందా? మంగళవారం రాత్రి ఢిల్లీలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేసిన ప్రకటనతో అందరిలోనూ ఇదే ఆలోచన మొదలైంది. కేసీ మాట్లాడుతూ.. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిసైడ్ చేసినట్లు చెప్పారు. అలాగే వన్ మ్యాన్ షో నడవదన్నారు. ఏ నిర్ణయమైనా సమిష్టిగానే తీసుకుంటామని కేసీ స్పష్టంగా ప్రకటించారు.

కేసీ ప్రకటనతోనే రేవంత్‌కు అప్పుడే స్పీడు బ్రేకులు ఏర్పాటు చేశారా అనే సందేహం మొదలైంది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు నిలయమని అందరికీ తెలిసిందే. ప్రతి గ్రూపుకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. ఏ గ్రూపు కూడా పార్టీలో లేదా ప్రభుత్వంలో తమదే రాజ్యమని అనుకునేందుకు లేదు. అధికారాలు ఉన్నట్లే ఉంటుంది తీరా ఉపయోగించాలని అనుకునేటప్పుడు చేతిలో నీళ్ళ లాగ మాయమైపోతుంది. అంటే ఏ గ్రూపైనా ఆధిపత్యం చెలాయిస్తున్నట్లే కనబడుతుంది. అంతేకానీ ఏ గ్రూపుకు పూర్తిస్థాయి అధికారాలుండవు.

దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ఆర్‌కు మాత్రమే ఇలాంటి వాటి నుండి మినహాయింపు ఉండేది. వైయ‌స్ఆర్‌ హయాంలో తాను చెప్పినట్లే అధిష్టానం నడుచుకునేది. మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తకూడదని నిర్ణయించుకున్నట్లుంది. అందుకనే ముఖ్యమంత్రిగా రేవంత్‌ను ఎంపిక చేస్తునే సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. అంటే ముఖ్యమంత్రి హోదాలో తన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకునేందుకు లేదని ముందుగానే హెచ్చరించటం అన్నమాట.

ఏదేమైనా రేవంత్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బలమైన గ్రూపులు పార్టీలో చాలానే ఉన్నాయి. సీనియర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, భట్టి విక్రమార్క లాంటి వాళ్ళు రేవంత్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటివాళ్ళని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత రేవంత్ పైనే ఉంటుంది. వీళ్ళని సమన్వయం చేసుకోవాలంటే తనిష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదు. నిర్ణయం తీసుకునేముందు క్యాబినెట్‌లో చర్చించాల్సిందే తప్ప రేవంత్‌కు వేరేదారిలేదు. కాబట్టి రేవంత్‌ను ముఖ్యమంత్రిగా చేస్తూనే.. మరోవైపు స్పీడు బ్రేకర్లు కూడా ఏర్పాటు చేసిందని అర్థ‌మవుతోంది.


First Published:  6 Dec 2023 11:18 AM IST
Next Story