Telugu Global
Telangana

కాంగ్రెస్‌కు అవే పాత భయాలు.. రంగంలోకి జానారెడ్డి!

హైదరాబాద్ గాంధీభవన్ నుంచి ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వరకు టికెట్ల కోసం ఎంతో మంది క్యూ కట్టారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కసరత్తు కొలిక్కి వచ్చింది.

కాంగ్రెస్‌కు అవే పాత భయాలు.. రంగంలోకి జానారెడ్డి!
X

సీనియర్లందరం కలిసే ఉన్నాం.. ఈ సారి కలిసి పని చేసి అధికారంలోకి వస్తాం.. అని కాంగ్రెస్ నాయకులు ఎన్ని చెప్పినా.. అధిష్టానం మాత్రం నమ్మడం లేదు. ఇప్పటికే బీసీ నాయకులు మాకు ఇన్ని టికెట్లు కావాలని ఢిల్లీలో డిమాండ్ పెట్టారు. మరోవైపు పార్టీలో చేరిన వాళ్లు కూడా ఇన్నేసి టికెట్లంటూ లిస్టు అగ్రనాయకుల ముందు ఉంచారు. పార్టీ అధికారంలో లేని పదేళ్లు మేము ఎటూ వెళ్లకుండా పార్టీని బతికించుకున్నామని మరి కొందరు. ఇలా ఎవరికి వారు కారణాలు చెప్తూ టికెట్లు అడుగుతున్నారు. ఇదిగో ఫస్ట్ లిస్టు.. అదిగో జాబితా అంటూ రోజులు గడుస్తున్నా.. ఇంకా టికెట్లు ఖరారు కాలేదు. సర్వేలు, సమీకరణలు అంటూ పార్టీ కసరత్తు చేస్తోందని సీనియర్ నాయకులు బయటకు చెప్తున్నా.. లోపల వేరే కారణం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ గాంధీభవన్ నుంచి ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వరకు టికెట్ల కోసం ఎంతో మంది క్యూ కట్టారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కసరత్తు కొలిక్కి వచ్చింది. అయితే లిస్టు విడుదల చేయగానే అసంతృప్తులు ఎలా రియాక్ట్ అవుతారో అనే అనుమానం అధిష్టానంలో ఉంది. టికెట్ రాని నాయకులు రెబెల్స్‌గా బరిలోకి దిగడమో.. లేదంటే ఇతర పార్టీల్లోకి జంప్ అవడమో జరిగితే.. కాంగ్రెస్ గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉన్నది. అందుకే ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నది.

తెలంగాణ అసెంబ్లీ సీట్ల సర్దుబాటు తర్వాత అసంతృప్త నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఫోర్‌మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. టికెట్లు రాని నాయకులు రభస చేయకుండా, ఇతర పార్టీల్లోకి మారకుండా ఈ కమిటీ వారిని బుజ్జగిస్తుంది. ఈ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఈ కమిటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, దీపాదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉన్నారు. టికెట్లు ఆశించి భంగపడిన నాయకులను బుజ్జగించడమే వీరి పని.

గతంలో కూడా టికెట్లు రాని కొంత మంది పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం, అనుచరులతో సహా వేరే పార్టీల్లోకి మారడం జరిగింది. ఆ పాత భయాల నేపథ్యంలోనే ఈ ఫోర్‌మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. సీట్లు ప్రకటించక ముందే కొంత మంది వద్దకు వీళ్లు వెళ్లి చర్చలు జరిపే అవకాశం ఉన్నది. ముందుగానే టికెట్ కేటాయించలేక పోతున్నామనే సందేశం ఇవ్వడంతో పాటు.. ఎందుకు ఇవ్వడం లేదో కూడా వివరించనున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే వారికి సముచిత స్థానం ఇస్తామనే వాగ్దానం కూడా ఈ ఫోర్‌మెన్ కమిటీ చేయనున్నది.

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. అధికారంలోకి వస్తామనే ధీమా పెరగడంలో టికెట్ల కోసం ఆశావహులు కూడా పెరిగారు. గతంలో కనీసం అభ్యర్థులు ఉంటారా అనే దశ నుంచి ఒకే స్థానం నుంచి భారీగా డిమాండ్ పెరిగే వరకు వచ్చింది. ఈ క్రమంలో అసంతృప్తుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఈ కమిటీ పని చేయనున్నది. మరి అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఎంత మేరకు పని చేస్తుందో వేచి చూడాలి.

First Published:  11 Oct 2023 11:58 AM IST
Next Story