Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో వలస నేతలకే పెద్దపీట

ఫస్ట్‌, సెకండ్‌ లిస్టుల్లోనూ వలస నేతలకు భారీగానే అవకాశాలు దక్కాయి. మొత్తం 55 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్‌.. ఈ లిస్ట్‌లో బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చింది.

కాంగ్రెస్‌లో వలస నేతలకే పెద్దపీట
X

అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇప్పటివరకూ 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలు పెండింగ్‌లో ఉండగా.. ఒక్క స్థానం సీపీఐకి కేటాయించింది. అయితే కాంగ్రెస్‌ ఇప్పటివరకూ ప్రకటించిన మూడు జాబితాల్లోనూ వలస నేతలకే పెద్దపీట వేసింది.

తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలోనూ బీజేపీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు అవకాశం కల్పించింది హస్తం పార్టీ. బీజేపీ నుంచి వచ్చిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి చెన్నూరు సీటు కేటాయించింది. బీజేపీ నుంచి వచ్చిన మరో నేత ఏనుగు రవీందర్ రెడ్డిని బాన్సువాడ బరిలో నిలిపింది. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన పురుమల్ల శ్రీనివాస్‌కు కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం కేటాయించింది. జూలైలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన కోరం కనకయ్యకు ఇల్లందు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. ఇక బోథ్‌ నుంచి వన్నెల అశోక్‌ను తప్పించిన హస్తం పార్టీ ఆయన స్థానంలో గతంలో బీఎస్పీ తరఫున పోటీ చేసిన అడె గజేందర్‌ను పోటీలో ఉంచింది. ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన నీలం మధు ముదిరాజ్‌కు పటాన్‌చెరు స్థానం నుంచి అవకాశం కల్పించింది. ఇక వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో అవకాశం దక్కించుకున్న మెగారెడ్డి సైతం ఆగస్టులోనే పార్టీలో చేరారు.




ఇక ఫస్ట్‌, సెకండ్‌ లిస్టుల్లోనూ వలస నేతలకు భారీగానే అవకాశాలు దక్కాయి. మొత్తం 55 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్‌.. ఈ లిస్ట్‌లో బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చింది. దాదాపు తొమ్మిది మంది వలస నేతలకు ఛాన్స్‌ ఇచ్చింది. మహబూబ్‌నగర్‌లో నలుగురు వలస నేతలకు టికెట్లు కేటాయించింది. బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరి మొదటి జాబితాలో టికెట్ పొందిన వారిలో నాగర్‌కర్నూలు అభ్యర్థి కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి, కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి, మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంత రావు, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్‌ రావు, నిర్మల్‌లో కూచాడి శ్రీహరిరావు, గద్వాలలో జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత ఉన్నారు. ఇక జూపల్లి కృష్ణారావు సైతం బీఆర్ఎస్‌ను వీడి హస్తం గూటికి చేరి కొల్లాపూర్‌ స్థానం దక్కించుకున్నారు. నకిరేకల్‌ అభ్యర్థి వేముల వీరేశం సైతం బీఆర్ఎస్‌ నుంచి వచ్చిన వారే. ఇక బీజేపీ నుంచి వచ్చిన వినయ్‌ కుమార్‌ రెడ్డికి ఆర్మూర్‌ సీటు కేటాయించింది కాంగ్రెస్.

ఇక రెండో జాబితాలోనూ వలసనేతలకు ప్రాధాన్యత ఇచ్చింది హస్తం పార్టీ. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి కూకట్‌పల్లి, శేరిలింగం పల్లి, తాండూరు, మహబూబ్ నగర్, మునుగోడు, భువనగిరి, పరకాల టిక్కెట్లు కేటాయించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన 12 గంటల వ్యవధిలోనే ఆయనకు మునుగోడులో పోటీ చేసే అవకాశం కల్పించారు. బీఆర్ఎస్‌లో చేరి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి సైతం టికెట్ దక్కించుకున్నారు. మొత్తంగా 25కు పైగా స్థానాల్లో వలసనేతలకే అవకాశమిచ్చింది.

వీరిలో చాలా మంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్లిన వారే. మరోసారి వారిని నమ్మి కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. ఇక పోటీ చేసేందుకు అవకాశం దక్కని పార్టీ నేతలు.. వలసనేతలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు ఇప్పటికే రాజీనామాలు ప్రకటించగా.. మరికొందరు అదే బాటలో నడుస్తారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌ మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

First Published:  7 Nov 2023 8:08 AM IST
Next Story