Telugu Global
Telangana

ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చేది లేదు.. మెగా డీఎస్సీకి రేవంత్ సుముఖం

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ రద్దు చేస్తారా..? అనుబంధ నోటఫికేషన్ తో పోస్ట్ ల సంఖ్య పెంచుతారా..? అనే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది.

ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చేది లేదు.. మెగా డీఎస్సీకి రేవంత్ సుముఖం
X

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటినుంచే ఎన్నికల హామీలను అమలులో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తోంది. రెండు గ్యారెంటీలను పట్టాలెక్కించింది. మిగిలిన గ్యారెంటీలకు 100 రోజుల డెడ్ లైన్ పెట్టింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియ విషయంలో కూడా తాము సుముఖంగా ఉన్నట్టు తెలిపే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే TSPSC వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. కొత్త బోర్డ్ నియమించి, నియామక ప్రక్రియలను స్పీడప్ చేయబోతున్నారు. ఇదే సమయంలో మెగా డీఎస్సీకి కూడా ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే రైతుబంధుపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి చురకలంటించారు. హామీల అమలు ఆలస్యమయితే ప్రతిపక్షాలకు విమర్శించేందుకు అవకాశం ఇచ్చినట్టే లెక్క. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి పడుతోంది. నియామకాల విషయంలో ఏమాత్రం విమర్శలకు తావులేకుండా ముందుకెళ్లాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెగా డీఎస్సీతో నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెబుతామంటున్నారు.

గత ప్రభుత్వం ఆల్రడీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 5,089 పోస్టులకు గాను 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల కోడ్ కారణంగా నియామక పరీక్ష వాయిదా పడింది. ఇప్పుడు ఆ పోస్ట్ లను పెంచి మెగా డీఎస్సీ వేయాలని చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత నోటిఫికేషన్ రద్దు చేయకుండా, పెంచిన పోస్ట్ లతో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. గవర్నర్ ప్రసంగంలో కూడా ఆరు నెలల్లో మెగా డీఎస్సీ అనే మాట ఉండటంతో నిరుద్యోగులు సంబరపడుతున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ రద్దు చేస్తారా..? అనుబంధ నోటఫికేషన్ తో పోస్ట్ ల సంఖ్య పెంచుతారా..? అనే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది. మొత్తమ్మీద అధికారంలోకి వచ్చాక ఎక్కడా ఏ చిన్న అసంతృప్తి లేకుండా.. ముఖ్యంగా ఎన్నికల హామీల విషయంలో ప్రజలకు, యువతకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

First Published:  16 Dec 2023 10:55 AM IST
Next Story