Telugu Global
Telangana

టెంపుల్ టూరిజం.. తెలంగాణ ప్రభుత్వ వ్యూహం ఫలించేనా..?

యాదాద్రి లాంటి భారీ ప్రాజెక్ట్ ని తలకెత్తుకోలేదు కానీ.. రాష్ట్రవ్యాప్తంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామంటున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. దేవాలయ ఖాళీ భూముల్లో భక్తుల కోసం కాటేజీలు నిర్మిస్తామని చెప్పారు.

టెంపుల్ టూరిజం.. తెలంగాణ ప్రభుత్వ వ్యూహం ఫలించేనా..?
X

అసెంబ్లీ ఎన్నికల ముందు ఎట్లుంది తెలంగాణ - ఎట్లైంది తెలంగాణ అనే క్యాంపెయిన్ లో యాదాద్రి ఆలయం గురించి కూడా ప్రముఖంగా చెప్పుకున్నారు బీఆర్ఎస్ నేతలు. యాదాద్రి విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్లముందు స్పష్టంగా కనపడుతుంది. అలాంటి మార్పు కాంగ్రెస్ హయాంలో కూడా తీసుకొస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. ఆధ్యాత్మిక రంగంలో తమదైన ముద్రవేయాలని వ్యూహరచన చేస్తున్నారు. టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.


కాటేజీల నిర్మాణం..

యాదాద్రి లాంటి భారీ ప్రాజెక్ట్ ని తలకెత్తుకోలేదు కానీ.. రాష్ట్రవ్యాప్తంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామంటున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. దేవాలయ ఖాళీ భూముల్లో భక్తుల కోసం కాటేజీలు నిర్మిస్తామని చెప్పారు. దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ శాఖలకు సంబంధించి బడ్జెట్ అంచనాల ముందస్తు సమీక్ష నిర్వహించిన ఆయన తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో తెలంగాణ ఆలయాలను సందర్శించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి. దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు. అటవీ శాఖతో కలిసి టెంపుల్ టూరిజాన్ని, ఎకో టూరిజం తో కలిపి టూరిస్ట్ సర్క్యూట్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు సంబంధించి దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు భట్టి.

రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న దేవుడి మాన్యాల పరిరక్షణతో పాటు, అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత నిచ్చేలా చూడాలని ఉప ముఖ్యమంత్రిని ఆమె కోరారు. రాష్ట్రంలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను తిరిగి పునరుద్దరించబోతున్నట్టు తెలిపారు. తొలి బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా టెంపుల్ టూరిజంపై కాంగ్రెస్ ఫోకస్ ఎలా ఉందో అంచనా వేయొచ్చు.

First Published:  24 Jan 2024 8:45 AM IST
Next Story