Telugu Global
Telangana

కాంగ్రెస్‌ పాలనలో గురుకులాలు అస్తవ్యస్తమయ్యాయి

మాజీ మంత్రి హరీశ్‌ రావు.. వాంకిడి గురుకుల విద్యార్థినులకు పరామర్శ

కాంగ్రెస్‌ పాలనలో గురుకులాలు అస్తవ్యస్తమయ్యాయి
X

కాంగ్రెస్‌ పాలనలో గురుకులాలు అస్తవ్యస్తమయ్యాయని.. వరుసగా గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న వాంకిడి గురుకుల విద్యార్థులను మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాంకిడి గురకులంలో ఫుడ్‌ పాయిజన్‌ తో 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, ఎనిమిదో తరగతి విద్యార్థిని మహాలక్ష్మీ, తొమ్మిదో తరగతి స్టూడెంట్స్‌ జ్యోతి, శైలజకు నిమ్స్‌ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వారిలో మహాలక్ష్మీ కోలుకున్నా, జ్యోతి ఆరోగ్య పరిస్థితి మెరుగు పరచడానికి డాక్టర్లు శ్రమిస్తున్నారని తెలిపారు. శైలజకు వెంటిలేటర్‌ పై ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారని, ధైర్యంగా ఉండాలని విద్యార్థినుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పానని అన్నారు. గురుకులాల్లో మెరుగైన విద్య, వసతులు ఉంటాయన్న నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ కారణాలతో ఇప్పటి వరకు 36 మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు. నెలకు ముగ్గురు చొప్పున విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకోవడం లేదన్నారు. 600 మంది విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌ తో అస్వస్థతకు గురయ్యారని, పాములు, ఎలుక కాట్ల ఘటనలు తరచూ జరుగుతున్నాయని, పిల్లలకు కరెంట్‌ షాక్‌ అన్నది కామన్‌ అయిపోయిందన్నారు.

సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉండి రెసిడెన్షియల్‌ స్కూళ్లను పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు 1,023 గురుకులాలు ఏర్పాటు చేశారని, వాటి నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వాంకిడి గురుకుల విద్యార్థులు హాస్పిటల్‌ వెళ్లేందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీ డబ్బులు ఇచ్చి పంపించేంత అధ్వనంగా పరిస్థితులు ఉన్నాయన్నారు. కేసీఆర్‌ ఏటా ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తే.. ఇప్పుడు గురుకులాలు అధ్వనంగా మారాయన్నారు. గురుకులాలకు రేవంత్‌ రెడ్డి రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ పేరుతో ఉన్న గురుకులాలను గాలికి వదిలేయద్దన్నారు. గురుకులాలపై సమీక్షించేందుకు గతంలో కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఉండేదని.. ఇప్పుడు ఆ సిస్టం లేకుండా పోయిందన్నారు. గురుకులాల్లో కనీస మందులు కూడా లేవన్నారు. మంచాలు లేక విద్యార్థులు కింద పడుకుంటున్నారని, దీంతో పాముకాట్లకు గురవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్‌ మూసివేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. భేషజాలకు పోకుండా రెసిడెన్షియల్ స్కూళ్లను బాగు చేయాలని కోరారు.

First Published:  5 Nov 2024 9:09 AM GMT
Next Story