ఆ తప్పు జరగకూడదు.. ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్
ఇళ్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ గానే ఉంది. ఆలస్యం, అలసత్వం లేకుండా చూడాలని అనుకుంటోంది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నినాదం బీఆర్ఎస్ కి మేలు చేయకపోగా ఎన్నికల వేళ ప్రజల్లో అసంతృప్తిని పెంచిందనేది వాస్తవం. లబ్ధిదారులందరికీ ఇళ్లు సమకూరలేదు, లాటరీలో ఇళ్లు దక్కనివారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కోపం పెంచుకున్నారు. ఎన్నికల్లో ఆ ప్రభావం కనపడింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతోపాటు గృహలక్ష్మి పథకం కూడా తెరపైకి తెచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ వ్యవహారాన్నంతా జాగ్రత్తగా గమనించిన కాంగ్రెస్, ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. తమ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మెజార్టీ ప్రజలకు దక్కాయని, బీఆర్ఎస్ హయాంలో లబ్ధిదారులు ఇబ్బందులుపడుతున్నారనే వాదన తెరపైకి తెచ్చింది, దీంతో ప్రజల్లో ఆలోచన మొదలై అది కాంగ్రెస్ కి అనుకూలంగా మారింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా గృహనిర్మాణం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం అది మొదటికే మోసం వస్తుంది. ఆ విషయంలో కాంగ్రెస్ అలర్ట్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గృహనిర్మాణంపై దృష్టి పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సదరు మంత్రిత్వ శాఖను బలోపేతం చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు భవనాల శాఖలోకి మారిన గృహ నిర్మాణ శాఖ విభాగాలను పునరుద్ధరించబోతున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈమేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకోసం ఆ విభాగాన్ని పునరుద్ధరిస్తూ, అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై సమకూర్చుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మూడు, నాలుగు నమూనాలను సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున, వాటి నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు మంత్రి పొంగులేటి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహిస్తారని చెప్పారాయన. నిధుల కొరత లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరో తరుణోపాయాన్ని కూడా సిద్ధం చేసింది. అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ సముదాయాలను ప్రభుత్వం విక్రయించాలనుకుంటోంది. వాటి ద్వారా సమకూరే మొత్తాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగిస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి. మొత్తమ్మీద ఇళ్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ గానే ఉంది. ఆలస్యం, అలసత్వం లేకుండా చూడాలని అనుకుంటోంది.