కష్టాలు కొని తెచ్చుకుంటున్న కాంగ్రెస్..
రేపు ప్రజా వ్యతిరేకత పెరిగితే.. కచ్చితంగా సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డికి నిరసన సెగ తగిలే అవకాశముంది. లోగోల విషయంలో ఇగోలకు పోతే మొదటకే మోసం వస్తుందని అంటున్నారు సీనియర్లు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలు కొని తెచ్చుకునేలా ఉంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల విషయంలో ప్రతిపక్షం తీవ్ర ఒత్తిడి తెస్తున్నా.. ఎన్నికల కోడ్ అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు మంత్రులు. వడ్ల బోనస్, కరెంటు కష్టాలు, తాగునీరు-సాగునీటి కొరత.. లాంటి సమస్యలున్నా ప్రజలు సర్దుకుపోతున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి కాంగ్రెస్ ప్రమాదం తెచ్చేలా ఉందనే ప్రచారం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర గేయానికి కొత్త స్వరాలు, రాష్ట్ర చిహ్నంలో మార్పులు కాంగ్రెస్ కి తిప్పలు కొని తెచ్చేలా ఉన్నాయి.
TS ని TG గా మార్చినా ఎక్కడా వ్యతిరేకత రాలేదు. అదే ఊపుతో తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం అనేసరికి చాలామందికి నచ్చలేదు. ఇది కేవలం బీఆర్ఎస్ చేస్తున్న విమర్శగా చూడలేం, సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోతోంది. తెలంగాణలో మంచి సంగీత దర్శకులే లేరా అనే ప్రశ్న వినపడుతోంది. ఇక ఈ విషయంలో తనకేం సంబంధం లేదని, అందెశ్రీ కోరుకున్నారు కాబట్టే కీరవాణికి ఆ బాధ్యత అప్పజెప్పామంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణ మరింత మంట పెట్టేలా ఉంది. ఈ వివరణతో ఉద్యమకారులు, ప్రజలెవరూ సంతృప్తి పడటంలేదు.
చిహ్నంపై రచ్చ..
తెలంగాణ చిహ్నంలో కాకతీయుల తోరణం, చార్మినార్ గుర్తుల్ని కూడా చెరపేస్తున్నారనే ప్రచారం కూడా కాంగ్రెస్ ని ఇరుకున పెడుతోంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ తోపాటు తటస్థులు, ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. సమస్యల పరిష్కారం పక్కనపెట్టి, కొత్త సమస్యలు తెచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.
టార్గెట్ రేవంత్..
పాట, గుర్తుపై ఇంత రచ్చ జరుగుతున్నా కాంగ్రెస్ నేతలెవరూ స్పందించకపోవడం విశేషం. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే తన వివరణ ఇచ్చుకున్నారు. ఆ విషయంలో సీనియర్ నాయకులెవర్నీ రేవంత్ రెడ్డి సంప్రదించలేదని తేలింది. అందుకే వారంతా సైలెంట్ గా ఉన్నారు. రేపు ప్రజా వ్యతిరేకత పెరిగితే.. కచ్చితంగా సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డికి నిరసన సెగ తగిలే అవకాశముంది. లోగోల విషయంలో ఇగోలకు పోతే మొదటకే మోసం వస్తుందని అంటున్నారు సీనియర్లు.