Telugu Global
Telangana

తెలంగాణలోనూ వలంటీర్‌ వ్యవస్థ.. - అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం

వలంటీర్ల ద్వారా పథకాలు అందజేస్తే నిజమైన అర్హులకు పూర్తి న్యాయం జరుగుతుందని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

తెలంగాణలోనూ వలంటీర్‌ వ్యవస్థ.. - అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన అద్భుత వ్యవస్థలు వలంటీర్ల, సచివాలయ వ్యవస్థలు. ఇవి ఎంత సూపర్‌హిట్‌ అయ్యాయో తెలిసిందే. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ వ్యవస్థలను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించాయి. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీలో సూపర్‌ హిట్‌ అయిన వలంటీర్‌ వ్యవస్థను తెలంగాణలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది.

వచ్చే జూలై నుంచి దీనిని అమలులోకి తీసుకురానున్నట్టు తాజాగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. సీఎం రేవంత్‌ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించిందని ఆయన తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో వలంటరీ వ్యవస్థను తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటినీ వలంటీర్ల ద్వారానే అందించాలని డిసైడ్‌ అయినట్టు వెల్లడించారు.

వలంటీర్ల ద్వారా పథకాలు అందజేస్తే నిజమైన అర్హులకు పూర్తి న్యాయం జరుగుతుందని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నవరత్నాల రూపంలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలను వలంటీర్ల ద్వారానే అర్హులందరికీ అందిస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ను ఇన్‌చార్జిగా పెట్టి ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తోంది. ఎక్కడైనా అర్హులకు పథకాలు అందటం లేదని ఫిర్యాదు వస్తే వెంటనే అధికారులు ఆ ఇంటికి వెళ్లి మాట్లాడి పథకాలు అందేలా చేస్తున్నారు.

దీంతో పాటు ప్రతి ప్రభుత్వ సమాచారాన్నీ వలంటీర్లు 50 ఇళ్లకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. దానివల్ల ఆ 50 ఇళ్లలో వలంటీర్‌ కూడా అంతర్భాగం అవుతున్న పరిస్థితి. ప్రతినెలా మొదటిరోజున తెల్లవారుజామునే వలంటీర్లు 66 లక్షల మందికి పెన్షన్లు అందించటం అన్నది నిజంగానే ఒక అద్భుతమని చెప్పాలి. రేషన్‌ రావటం లేదన్నా, మున్సిపాలిటీలో పని కావాలన్నా, పెన్షన్‌ కావాలన్నా, ఇళ్ల పట్టాలు అందాలన్నా.. ఇలా ఏ విషయాన్ని వలంటీర్లతో చెప్పినా లేదా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళితే వెంటనే పనైపోతోంది. అంతలా పాపులరైన వలంటీర్ల వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. అయితే వలంటీర్‌ వ్యవస్థ విధివిధానాలను మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.

First Published:  2 May 2024 1:09 PM IST
Next Story